కలం, వెబ్ డెస్క్: అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ దూసుకువెళుతుందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు (CM Chandrababu) వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్‌తో కలిసి ఆయన పార్టీ జెండా ఆవిష్కరించి మహానాడు 2026 పార్టీ పండుగను ప్రారంభించారు. ఈ సందర్భంగా నందమూరి తారక రామారావు (NTR) విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. యువతకు టీడీపీ ప్రాధాన్యత ఇస్తుందని.. ఈ మహానాడును మహిళలకు అంకింతం చేస్తున్నామని ప్రకటించారు. దేశ రాజకీయాల్లో ఇంతటి ప్రభావం చూపిన పార్టీ మరొకటి లేదని వ్యాఖ్యానించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇస్తున్నామని తెలిపారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా బాధ్యత కలిగిన పార్టీగా మహానాడును ‘హైబ్రిడ్ మోడల్’ లో నిర్వహిస్తున్నామని చెప్పారు. మారింది మీటింగ్ విధానమే కానీ.. మహానాడు విధానం కాదు అని స్పష్టం చేశారు.
ఏపీకి పెట్టుబడుల వెల్లువ..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని చంద్రబాబు ఈ సందర్భంగా తెలిపారు. 23 నెలల్లో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చామని ప్రకటించారు. ఈ పెట్టుబడులతో 23 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. సాఫ్ట్ వేర్ రంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకుని ఏపీని ప్రపంచంలోనే నెంబర్.1గా నిలుపుతామని అన్నారు. యువత, మహిళలు తమ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేశామని చెప్పిన సీఎం.. అభివృద్ధి, సంక్షేమం దిశగా రాష్ట్రం వేగవంతంగా పరుగులు తీస్తుందని అన్నారు.
94 శాతం స్ట్రయిక్ రేటుతో విజయం..
అధికార ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ వారిలో ఒకరిగా మెలగాలని సీఎం సూచించారు. తమపై ప్రజలు నిలబెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయబోమని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 94 శాతం స్ట్రయిక్ రేటుతో విజయం సాధించామని స్పష్టం చేశారు. ప్రత్యర్థులకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా తీర్పు చెప్పారని.. ప్రజలు మనపై పెట్టుకున్న ఆశలను ఖచ్చితంగా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ప్రధానంగా యువత, మహిళలు పార్టీ విజయానికి అండగా నిలిచారని… కార్యకర్తల శ్రమను పార్టీ మరచిపోదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏపీని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తామని అన్నారు.

