కలం, వెబ్‌డెస్క్: ఎప్పుడూ సరదాగా, అల్లరి చేస్తూ ఆడుకునే పిల్లలు ఒక్కసారిగా అనారోగ్యానికి గురైతే తల్లిదండ్రుల బాధ వర్ణణాతీతం. పిల్లలకు జర్వం, దగ్గు, జలుబు ఇలా ఏ చిన్న సమస్య వచ్చినా.. వారు కోలుకునే వరకు తల్లిదండ్రులకు రాత్రిళ్లు నిద్ర కూడా ఉండదు. అసలే వర్షాకాలం ప్రారంభమైంది. ఈ సమయంలో ఇన్ఫెక్షన్ల ముప్పు ఎక్కువగా ఉంటుంది. అందుకే పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు తల్లిదండ్రులు తగిన ముందస్తు జాగ్రత్తలు (Health Tips) తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
సరైన నిద్ర, ఆహారం ముఖ్యం
వర్షాకాలం ప్రారంభంలోనే పాఠశాలలు కూడా పునః ప్రారంభం అవుతాయి. అయితే, సమ్మర్ హాలీడేస్‌లో రోజంతా ఇంట్లోనే ఉండటం వల్ల పిల్లల డెయిలీ రోటీన్ పూర్తిగా మారిపోతుంది. ఆలస్యంగా పడుకోవడం, ఆలస్యంగా నిద్ర లేవడం, వేళకు తినకపోవడం వారికి అలవాటు అవుతుంది. దీనివల్ల స్కూల్స్ ప్రారంభమైన మొదటి కొన్ని వారాల్లోనే పిల్లు సరైన నిద్ర, సరైన తిండి లేక డీలా పడుతుంటారు. ఇది వారిని త్వరగా అనారోగ్యానికి గురిచేస్తుంది. అందుకే స్కూళ్లు తెరిచే కొన్ని రోజుల ముందు నుంచే పిల్లలు తర్వగా పడుకునేలా తల్లిదండ్రులు అలవాటు చేయాలి.
రోజూ కనీసం 8 నుంచి 10 గంటలు ప్రశాంతంగా నిద్ర పోయేలా చూసుకోవాలి. అదే విధంగా ఉదయం టిఫిన్ తినడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. పిల్లలకు రోజూ ఉదయాన్నే సరైన పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించడం చాలా ముఖ్యం. దీని వల్ల వారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే, వారి లంచ్ బాక్స్ లో కూడా తాజా కూరగాయలు, ఆకుకూరలతో కూడిన పౌష్ఠికాహారం ఉండేలా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు వైద్యులు.
అనారోగ్య లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ వద్దు!
వర్షాకాలంలో పిల్లలు వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కలుషితమైన ఆహారం, నీటి వల్ల జీర్ణకోశ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే పిల్లలకు ఖచ్చితంగా కాచి చల్లార్చిన నీటిని మాత్రమే ఇవ్వాలి. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి. పిల్లలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా చూసుకోవాలి. వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైద్యుల దగ్గరికి తీసుకెళ్లాలి. పిల్లలు తరచుగా దగ్గు, తుమ్ములు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయకూడదని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
స్కూల్ ఒత్తిడిని దూరం చేద్దాం
అప్పుడే స్కూల్‌కు పంపిన పిల్లలు కొత్త టీచర్స్, చదువులకు అలవాటు పడాల్సి ఉంటుంది. దీనివల్ల కొంతమంది పిల్లలు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే పిల్లల మనోభావాలను తల్లిదండ్రులు అర్థం చేసుకుని వారితో ఓపికగా మాట్లాడాలి. పిల్లల మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. వర్షంలో తడిసిన దుస్తులు, సాక్స్, షూస్‌తో ఎక్కువసేపు ఉండటం వల్ల చర్మ సమస్యలు, ఫంగల ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంటికి వచ్చిన వెంటనే పొడి దుస్తులు మార్చుకునేలా అలవాటు చేయాలి. ఈ జాగ్రత్తలు పాటించడం వలన పిల్లలు అనారోగ్యం నుంచి బయటపడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.

