కలం, వెబ్ డెస్క్: బిగ్‌బాస్ (Bigg Boss).. బుల్లి తెరపై ఓ సంచలనం. బాలీవుడ్ నుంచి దక్షిణాదిలో అన్ని భాషల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ షో తెలుగులో పదో సీజన్ (Season 10)కు చేరువలో ఉంది. వంద రోజుల పాటు సాగే ఈ షోలో ఎంట్రీ కోసం విపరీతమైన పోటీ ఉంటుంది. సినీ తారలు, యాంకర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్లు మొదలుకొని సామాన్యుల వరకు అందరూ ఒక్క సారైనా ఈ షోలో పాల్గొనాలని కోరుకుంటూ ఉంటారు. ఇప్పటికే చిన్న చితకా ఇన్‌ఫ్ల్యూయెన్సర్లు తమ ప్రయత్నాలు ప్రారంభించేశారు. ఇక తాజాగా ఓ పోలీస్ ఆఫీసర్ తాను కూడా బిగ్‌బాస్ తెలుగు (Bigg Boss Telugu) షోలో పాల్గొనాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఏపీలోని నంద్యాల (Nandyal) జిల్లా గడివేముల ఎస్ఐ నాగార్జున రెడ్డి (SI Nagarjuna Reddy) ఆసక్తికర వీడియో విడుదల చేశారు. బిగ్ బాస్ షో సామాన్యుల నుంచి కూడా అత్యుత్తమ ప్రతిభను వెలికితీస్తోందని షో యాజమాన్యాన్ని అభినందించారు. తనకు బిగ్ బాస్ హౌస్‌లో అడుగు పెట్టే అవకాశం ఇస్తే తన ధైర్యాన్ని, ఓర్పును, తనలో ఉన్న ప్రతిభను ప్రేక్షకులందరికీ చూపించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవాలని ఎదురు చూస్తున్నట్లు చెప్పారు.
బిగ్‌బాస్ హౌస్‌లో ఉండటం, అక్కడు ఓర్పుతో నడుచుకోవడం చాలా కష్టమన్నారు. తాను ఇప్పటి వరకు అన్ని బిగ్‌బాస్ సీజన్లను చూసినట్లు చెప్పారు. ఎన్నో సవాళ్లు, కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయన్నారు. వాటన్నింటిని ఓర్పుతో, తెలివితో ఎదుర్కోవాలని అన్నారు. తనకు ఈ షోలో అవకాశం కల్పిస్తే ఏపీ ప్రజల హృదయాలు గెలుచుకొని, తన నిజమైన టాలెంట్‌ను గెలుచుకుంటానన్నారు. తన కుమార్తెల కోరిక మేరకు వీడియో విడుదల చేశానని, అవకాశం వస్తే సంతోషిస్తామని నాగార్జున అన్నారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కూడా కాంపిటీషన్‌కు వస్తున్నారా అని నెటిజన్లు షాకవుతున్నారు.

