కలం, వెబ్‌డెస్క్: దాయాది దేశం పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ (Balochistan) ప్రావిన్స్ రక్తమోడుతోంది. బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ)కి, పాకిస్థాన్ సైన్యానికి మధ్య జరుగుతున్న ఘర్షణల్లో రెండు రోజుల్లోనే దాదాపు 200 మంది చనిపోయారు. వీరిలో బీఎల్ఏ సభ్యులు, పాక్ సైనికులు, ప్రభుత్వాధికారులతోపాటు సాధారణ ప్రజలు ఉన్నారు. మహిళలు, చిన్నారులు సైతం ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్ నుంచి స్వాతంత్య్రం కోరుతూ బలూస్థాన్ ప్రాంతంలోని బీఎల్ఏ దశాబ్దాలుగా చేస్తున్న పోరాటం ప్రస్తుతం తీవ్ర రూపం దాల్చింది. వీళ్ల పోరాటం పాక్‌తోపాటు చైనా, అమెరికాకు సైతం ఇబ్బందికరంగా మారింది.
ఒకేసారి చాలా సిటీల్లో ‘హెరోఫ్ 2’..
బీఎల్ఏ సభ్యులు ‘హెరోఫ్ 2’ పేరుతో శనివారం ఒకేసారి వేర్వేరు చోట్ల కాల్పులకు, ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. హెరోఫ్ అంటే ‘నల్ల తుపాను’ అని అర్థం. ఈ పదాన్ని ఎక్కువగా బలూచ్ సాహిత్యంలో ఉపయోగిస్తారు. మొదటిసారి 2024లో ‘హెరోఫ్ 1’ పేరుతో బీఎల్ఏ దాడులు చేసింది. అప్పట్లో కేవలం పాక్ సైన్యాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుంది. ప్రస్తుతం సైన్యంతోపాటు పాక్‌కు చెందిన ఇతర ప్రభుత్వాధికారులు, ప్రజలపైనా దాడులు చేస్తోంది.
ఈ క్రమంలో శనివారం బలూచిస్థాన్ (Balochistan) రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఒకేసారి కాల్పులు, దాడులకు దిగారు. క్వెట్టా, నోష్కీ, మస్తుంట్, దల్బందిన్, కలత్, ఖరన్, పంజ్‌గుర్, గ్వాదర్, పస్ని, తుర్బత్, టంప్, బులేదా, మంగోచర్, లస్బేలా, కెచ్, అవారన్ తదితర ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, భద్రతా సిబ్బందిపై బీఎల్ఏ సిబ్బంది దాడి చేశారు. దాదాపు 800 నుంచి 1000 మంది వరకు ఈ దాడుల్లో పాల్గొన్నట్లు సమాచారం. వీళ్లలో మహిళలు కూడా ఉన్నారు.
ఈ దాడుల్లో 31 మంది పౌరులు, 17 మంది పోలీసులతో సహా 200 మంది చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. 145 మంది బీఎల్ఏ సభ్యులను చంపినట్లు పాక్ ప్రకటించగా, బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఖండించింది. తమ వాళ్లు 7 మంది మాత్రమే చనిపోయారని, అందులోనూ నలుగురు ఆత్మాహుతి దళ సభ్యులని చెప్తోంది. అలాగే, తాము 84 మంది పాక్ సైనికులను చంపినట్లు వెల్లడించింది.
చైనా, అమెరికా కలవరం..
బలూచిస్థాన్‌లో ఘర్షణలు, దాడులు తీవ్రం కావడంతో చైనా, అమెరికా కలవరపడుతున్నాయి. తమ పెట్టుబడుల గురించి ఆందోళన చెందుతున్నాయి. పాకిస్థాన్‌లో విస్తీర్ణం పరంగా అతిపెద్ద రాష్ట్రమైన బలూచిస్థాన్ ఎక్కువగా కొండలతో ఉంటుంది. ఈ ప్రాంతంలో ఆయిల్ నిల్వలు, బొగ్గు, కాపర్, బంగారంతోపాటు రేర్ ఎర్త్ మినరల్స్ విస్తారంగా ఉన్నాయి. వీటిపైన కన్నేసిన అమెరికా ఇటీవలే రేర్ ఎర్త్ మినరల్స్ మైనింగ్ కోసం పాక్ ప్రభుత్వంతో 1.25బిలియన్ డాలర్లకు ఒప్పందం కుదర్చుకుంది. అలాగే, అమెరికాలోని మిస్సోరి కేంద్రంగా పనిచేసే మరో సంస్థ సైతం ఇలాగే 500 మిలియన్ డాలర్లతో మైనింగ్ కోసం ఎంవోయూ చేసుకుంది. ఇప్పుడు బలూచిస్థాన్‌లో ఉద్రిక్తలు, దాడులు పెరగడం ఈ రెండు ప్రాజెక్టులపై ప్రభావం చూపిస్తోంది.
మరోవైపు, చైనా సైతం బలూచ్ ఆందోళనలపై కంగారు పడుతోంది. ఆ దేశానికి ఎంతో ప్రతిష్ఠాత్మకమైన చైనా–పాక్ ఎకనమిక్ కారిడార్(సీపెక్)కు బలూచిస్థానే కీలకం. ఈ ప్రాంతంలో విస్తారమైన సహజ వనరులు ఉండడంతోపాటు ఇది మధ్య ఆసియా ప్రాంతాన్ని పాక్ ద్వారా చైనాతో అనుసంధానం చేస్తోంది. అలాగే, ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్‌తో సరిహద్దులు కలిగి ఉంది. ఈ నేపథ్యంలో తమ వాణిజ్యాన్ని మధ్య ఆసియా ప్రాంతానికి, ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్‌కు అక్కడి నుంచి యూరప్‌కు విస్తరించడానిక సీపెక్ ప్రాజెక్టును చైనా మొదలుపెట్టింది. దీనిని వ్యతిరేకిస్తున్న బీఎల్ఏ ఇప్పటికే అనేక సార్లు పనులు జరుగుతున్న ప్రాంతాలపై దాడులు చేసింది. కొంతమంది చైనీయులను సైతం చంపేసింది. ఈ క్రమంలో పాక్ ప్రభుత్వం సాయంతో బలూచిస్థాన్‌లో చైనా దళాలు తిష్ఠ వేశాయి.
అన్ని సహజ వనరులు ఉన్నప్పటికీ ఎన్నో ఏళ్లుగా పాక్ ప్రభుత్వం తమను నిర్లక్ష్యం చేస్తోందని బలూచిస్థాన్ ప్రజలు భావిస్తున్నారు. అందుకే స్వాతంత్య్రం కోసం పోరాడుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. కానీ, ఎన్నో దేశాలనే తమ గుప్పిట్లో పెట్టుకున్న చైనా, అమెరికా ఈ ప్రాంతాన్ని సైతం తమ స్వార్థం కోసం బలితీసుకునే ప్రమాదం ఎంతో దూరంలో లేదని మానవ హక్కుల సంఘాలు, అంతర్జాతీయ పరిశీలకులు అనుమానం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


