కలం, జనగామ బ్యూరో: జనగామ జిల్లా దేవరుప్పుల మండలం లకావత్ తండా గ్రామ పంచాయతీ పరిధిలో ప్రముఖ పుణ్యక్షేత్రం వానకొండయ్య (Vanakondayya Gutta) లక్ష్మి నరసింహ స్వామి క్షేత్రం మైనింగ్ మాఫియా చేతిలో పడి ఉనికి కోల్పోతుందని బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) అన్నారు. ఈ మేరకు గురువారం జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా (Sandeep Kumar Jha)ను దేవరుప్పుల మండల బీఆర్ఎస్ బృందంతో కలిసి మెమోరాండం అందజేసి గుట్ట మీద జరుగుతున్న మైనింగ్ పర్మిషన్ ను రద్దు చేయాలని కోరారు. గుట్ట వద్ద మైనింగ్ పనులు జరిగితే దేవాలయం ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ పనులను ఆపి దేవస్థానం మనుగడను కాపాడి 2 కోట్ల రూపాయలతో దేవాలయ అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల తిరిగి మైనింగ్ పనులను మొదలు పెట్టారని ఎర్రబెల్లి (Errabelli Dayakar Rao) మండిపడ్డారు. గుట్ట వద్దకు బీఆర్ఎస్ నాయకులు వెళ్లి పనులను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే తమ నాయకుల మీద కేసులు పెట్టి, నోటీసులు పంపించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. ఏది ఏమైనా వానకొండయ్య గుట్ట మైనింగ్ పనులు ఆపకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్యర్యంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. వీటితో పాటు పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని కూడా ప్రభుత్వం తొందరగా కొనుగోలు చేయాలని కోరారు. అలాగే మాదాపురం గ్రామంలో ఎస్సీ కాలనీలో 30 డబుల్ బెడ్ రూం ఇండ్ల మూడవ విడత బిల్లులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవరుప్పుల మండల బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Read Also: కోటి మందికి పైగా లబ్ధి: కనీస వేతనాలపై మంత్రి వివేక్ కీలక ప్రకటన
Follow Us On : WhatsApp

