కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ సచివాలయంలో మంత్రి వివేక్ (Minister Vivek) కీలక విషయాలు వెల్లడించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కనీస వేతనాలు పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విషయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. నియమ నిబంధనల ప్రకారం ప్రతీ ఐదేండ్లకోసారి వేతనాలను సవరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కార్మికులకు మంచి వేతనాలు అందినప్పుడే వారిలో సంతృప్తి పెరిగి, ఉత్పత్తి కూడా మెరుగవుతుందని అభిప్రాయపడ్డారు.
ఈ వేతనాల సవరణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీ చర్చల్లో సీఐఐ, ఫ్యాప్సీ ప్రతినిధులు పాల్గొన్నారు. కనీస వేతనాలు బాగున్నప్పుడే ఫ్యాక్టరీలు విజయవంతంగా నడుస్తాయని వారు అంగీకరించారు. ప్రస్తుత కాలంలో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని పారిశ్రామికవేత్తలే స్వయంగా కోరడం విశేషం. ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ఒక క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు.
ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలో మొత్తం కోటి 11 లక్షల మంది కార్మికులకు లబ్ధి చేకూరుతుందని మంత్రి వివేక్ వివరించారు. రాష్ట్రంలో స్కిల్ లేని వర్కర్లు అత్యధికంగా 75 లక్షల మంది ఉన్నారని చెప్పారు. అలాగే సెమీ స్కిల్డ్ వర్కర్లు 21 లక్షల మంది, స్కిల్డ్ వర్కర్లు 6.4 లక్షల మంది ఉన్నట్లు గణాంకాలను విడుదల చేశారు. జూన్ మొదటి తేదీ నుంచే ఈ కొత్త వేతనాల అమలు ప్రక్రియ ప్రారంభం కానుందని మంత్రి స్పష్టం చేశారు.

