కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) నగరపాలక సంస్థ పరిధిలోని తీగలగుట్టపల్లి 2వ డివిజన్‌లో పర్యావరణ పరిరక్షణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ మై భారత్ జిల్లా యువజన అధికారి జి.తిరుపతి రెడ్డి కలిసి పర్యావరణ పరిరక్షణ అవగాహన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. తెలంగాణ గాంధీ స్మారక నిధి, హైదరాబాద్, నేషనల్ యూత్ ప్రాజెక్ట్ (NYP), నిఫా (NIFA) సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. చెట్ల నరికివేత, అడవుల అంతరించిపోవడం వలన భూతాపం పెరిగి తీవ్రమైన ఎండలు ఇబ్బంది పెడుతున్నట్లు వివరించారు. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మై భారత్ ప్రోగ్రామ్ ఆఫీసర్ రవీందర్, NYP రాష్ట్ర అధ్యక్షుడు యాదవరాజు, రాజశేఖర్, గొల్లె తిరుపతి, గాండ్ల నరేశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

