రైతుకు కుచ్చుటోపీ!.. ఎనుమాముల మార్కెట్లో అధికారుల ఇష్టారాజ్యం

కలం, వరంగల్ బ్యూరో: మూలిగే నక్క మీద తాటిపండు పడిన చందంగా తయారైంది రైతు పరిస్థితి. ఓ పక్క పండించిన పంటకు గిట్టుబాటు ధరతో కొనే నాథుడు లేక అవస్థలు పడుతుంటే, పంట కొన్న వ్యాపారులు డబ్బులు ఎగ్గొట్టి పరార్ అవుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఆసియాలోనే అతిపెద్దదైనా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ (Enumamula Market) కు మూడేళ్లుగా పాలకవర్గం లేకపోవడంతో పట్టుతప్పింది. ఆ వ్యవసాయ మార్కెట్‌పై స్థానిక ప్రజాప్రతినిధుల పట్టుసాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఆధిపత్యపోరుతో ప్రభుత్వం పాలకవర్గ నియామకాన్ని నిలిపివేసింది. ఒక వర్గం వారికి పదవి ఇస్తే మరో వర్గం నేతలు గుర్రుగా ఉంటున్నారని ప్రభుత్వ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఆ వ్యవసాయ మార్కెట్‌కు పాలకవర్గాన్ని నియమించకపోవడం విమర్శలకు తావిస్తోంది. దీంతో అక్కడ అధికారులు, దళారులు కుమ్మక్కై రైతులను నిలువుదోపిడీ చేస్తుంటే, కొందరు వ్యాపారులు ఐపీపెట్టి పారిపోతున్నారు.

ఆధిపత్య పోరులో రైతు ఆగం

మార్కెట్ యార్డు ప్రధానంగా చైర్మన్ పదవి కోసం మంత్రి కొండా సురేఖ, వర్థన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎవరికివారే ప్రయత్నాలు చేసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వ పెద్దలు ఏమీ తేల్చుకోలేక మార్కెట్ పాలకవర్గ నియామకాన్ని వాయిదా వేయడంతో పాలన గాడి తప్పింది. 2023 జులై నెలలో గత పాలక వర్గం గడవు ముగిసింది. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు నాగారాజు, రేవూరి ప్రకాశ్ రెడ్డి, కడియం శ్రీహరి వేర్వేరుగా పలువురు పేర్లను మార్కెట్ చైర్మన్ కోసం ప్రతిపాదనలు చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన రెండు నెలలకే మార్కెట్ పాలక వర్గాన్ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జాబితా బయటకు రావడానికి ముందు రోజే ఆ ఉత్వర్వులను వెనక్కి తీసుకుంది ప్రభుత్వం. స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి వల్లే ప్రభుత్వం ఉత్తర్వులు వెనక్కి తీసుకుందన్న ఆరోపణలు వచ్చాయి.

రైతులను ముంచుతున్న వ్యాపారులు

మార్కెట్ కు పాలకవర్గం లేకపోవడంతో ఎవరికివారే యమునాతీరే అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. అధికారులు, దళారులు కుమ్మక్కై రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఈ మార్కెట్‌కు నిత్యం లక్షలాది మంది రైతులు పంటను తీసుకొస్తుంటారు. కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతాయి. ధరలు, సౌకర్యాలు, తూకాల్లో మోసాలపై నిత్యం రైతులు ఆందోళనలు జరుగుతున్నాయి. ఇటీవలే ఓ వ్యాపారి రెండున్నర కోట్ల రూపాయలకు ఐపీ పెట్టడం సంచలనంగా మారింది. ఇప్పటికీ అతడిపై చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. దీంతో అతడికి సరుకు ఇచ్చి మోసపోయిన అడ్తీ వ్యాపారులు మార్కెట్ ను స్తంభింపచేశారు. మిర్చికొనుగోళ్లు నిలిపివేసి ఆందోళనలు చేపట్టారు. అయినా ప్రభుత్వ పెద్దలు స్పందించలేదు. ఇదిలా ఉండగా తాజాగా మరో వ్యాపారి రూ. 2 కోట్లకు ఐపీ పెట్టి పరారయ్యాడు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు.

గాడితప్పిన పాలన

మార్కెట్లో జరిగే క్రయవిక్రయాల్లో అనేక అవకతవకలు జరుగుతున్నాయి. పాలకవర్గం లేకపోవడంతో ఎవరికైనా అమ్మవచ్చు, కొనుగోలు చేయవచ్చనే దుస్థితి ఏర్పడింది. దీంతో దళారులదే రాజ్యమైంది. వారు చెప్పిన రేటుకే రైతులు తమ పంటను అమ్ముకోవాల్సి వస్తోంది. మరోవైపు ఉద్యోగులను భర్తీ చేయలేని ప్రభుత్వం, కనీసం మార్కెట్ కు పాలకవర్గాన్ని కూడా నియమించలేని దుస్థితిలో పాలకులు ఉన్నారని రైతులు సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీంతో మార్కెటింగ్ శాఖలో ఉన్న లోపాలను కొందరు క్యాష్ చేసుకుంటూ కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్నారు. మరోవైపు మూడేళ్ల నుంచి మార్కెట్ ఆదాయం ఏటా తగ్గిపోతోంది. మూడేళ్ల క్రితం రూ. 50 కోట్ల ఆదాయం ఉంటే అది కాస్తా ఇప్పుడు రూ. 36 కోట్లకు పడిపోయినట్లు సమాచారం. తగినంత మంది ఉద్యోగులు లేక పోవడం, పన్ను వసూళ్లపై దృష్టి సారించకపోవడం.. నలుగురుచేసే పని ఒకే ఉద్యోగిపై పడడంతో ఈ దుస్ధితి ఏర్పడుతోంది. నలభై ఏండ్ల నుంచి మార్కెట్లో ఉద్యోగాలను భర్తీ చేయలేదు. కారుణ్య నియమాకాలు మినహా కొత్తగా భర్తీ లేదు. ఇప్పటికైనా జిల్లాకు చెందిన మంత్రి, ఎమ్మెల్యేలు పంతానికి పోకుండా సమిష్టి నిర్ణయంతో ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కు కొత్త పాలకవర్గం నియమించేలా దృష్టిసారించాలని ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>