కలం, వెబ్ డెస్క్ : దేవాదాయ శాఖలో (Endowments Department) సహాయ కమిషనర్‌గా పనిచేస్తున్న శాంతి (Shanti)పై ప్రభుత్వం మరోసారి సస్పెన్షన్ వేటు వేసింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఏసీబీ అధికారులు ఆమెను అరెస్ట్ చేసిన నేపథ్యంలో, ఆ శాఖ కమిషనర్ కె. రామచంద్రమోహన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏ ఉద్యోగి అయినా 48 గంటలకు మించి కస్టడీలో ఉంటే సస్పెన్షన్ విధిస్తారు. ఈ నిబంధన ప్రకారమే ఈ నెల 7వ తేదీ నుంచే ఆమె సస్పెన్షన్ అమల్లోకి వచ్చినట్లు కమిషనర్ తెలిపారు. అలాగే అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లకూడదని ఆమెను ఆదేశించారు.
శాంతి వద్ద సుమారు 1.37 కోట్ల రూపాయల మేర ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ (ACB) ప్రాథమికంగా గుర్తించింది. ఈ సమాచారం ఆధారంగా ఏప్రిల్ 6న ఆమెపై (Shanti) కేసు నమోదు చేసి, మరుసటి రోజే అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. గతేడాది జూలై నుంచి వివిధ ఆరోపణలతో సస్పెన్షన్‌లో ఉన్న ఆమె, ఇటీవలే హైకోర్టును ఆశ్రయించి తనకు అనుకూలంగా తీర్పు పొందారు. దీనితో మార్చి 24న ఆమెపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయగా, తిరిగి విధుల్లో చేరిన కొద్ది రోజుల్లోనే మళ్లీ ఏసీబీ చిక్కుల్లో పడి మరోసారి సస్పెన్షన్ గురికావడం గమనార్హం.
Read Also: నో కాంప్రమైజ్.. ఇదే జెన్ జీ ఫార్ములా!!
Follow Us On : WhatsApp

