దివ్యాంగులకు సానుభూతి కాదు ఆత్మగౌరవం కల్పించాలి: ఎంపీ అర్వింద్

కలం, నిజామాబాద్ బ్యూరో: ‘సెప్టెంబర్ 17’ను సేవా దినంగా భావిస్తూ, ప్రదాని మోదీ జన్మదినం సందర్భంగా దివ్యాంగులు, వయోవృద్ధులకు సహాయక పరికరాలు అందించడం అభినందనీయమని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి (Dharmapuri Arvind) అన్నారు. మోదీ మార్గదర్శకత్వంలో దివ్యాంగుల సంక్షేమం, సాధికారతకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. దివ్యాంగులకు సానుభూతి కాదు.. అవకాశాలు, అందుబాటు, గౌరవం, సాధికారత అవసరమని ఎంపీ స్పష్టం చేశారు.

సహాయక పరికరాలు వారి స్వాతంత్ర్యం, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవానికి సాధనాలని పేర్కొన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రూ.2.10 కోట్లకు పైగా కేంద్ర నిధులతో 1,000 మందికి వివిధ రకాల సహాయక పరికరాలు అందించడం ద్వారా ప్రయోజనం చేకూరనుందని ఎంపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో 19 రకాల సహాయక పరికరాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సహకరిస్తున్న కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్‌కు ఎంపీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ సహకారంతో అర్హులైన లబ్ధిదారులకు అవసరమైన సహాయం మరింత చేరువ అవుతోందన్నారు. నిజామాబాద్ నార్త్, ఆర్మూర్, బోధన్, జగిత్యాల కోరుట్ల ప్రాంతాల్లో ఇప్పటికే సుమారు 1000 మంది దివ్యాంగులను గుర్తించామని, మిగిలిన అర్హుల గుర్తింపు ప్రక్రియను కూడా కొనసాగిస్తామని తెలిపారు. మారుమూల గ్రామాల్లో ఉన్న అర్హులెవరూ ప్రభుత్వ సహాయానికి దూరం కాకుండా చూడాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, స్రవంతి రెడ్డి, ప్రమోద్, కార్పొరేటర్లు నాగొల్ల లక్ష్మీనారాయణ, వైష్ణవి సుధా, జ్యోతి మురళి, ప్రసూన శ్రీనివాస్ రెడ్డి, మహిళా శిశు వికలాంగుల శాఖ జిల్లా అధికారి సౌందర్య, అలింకో ప్రతినిధులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>