కలం, నల్లగొండ: నల్లగొండ ఆర్టీసీ డిపోలో(Nalgonda RTC Depot) ఎలక్ట్రిక్ బస్సుల డ్రైవర్లు శనివారం తెల్లవారుజామున ఆందోళనకు దిగారు. ఉదయం 4 గంటల నుంచి మూడు గంటల పాటు బస్సులను నిలిపివేసి నిరసన తెలిపారు. పెంచిన వేతనాలు చెల్లించాలని, కక్షపూరిత చర్యలు మానుకోవాలని డిమాండ్ చేస్తూ డ్రైవర్లు, సీఐటీయూ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ‘జేబీఎం సిస్కాన్ మ్యాన్‌పవర్’ సంస్థ ప్రతినిధుల తీరుపై డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ హక్కుల కోసం యూనియన్ ఏర్పాటు చేసుకున్నందుకే యాజమాన్యం వేధింపులకు గురిచేస్తోందని సీఐటీయూ నేతలు ఆరోపించారు. గత 16 నెలలుగా పనిచేస్తున్నా వేతనాలు పెంచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న సూర్యాపేట, వరంగల్ డిపోల్లో డ్రైవర్లకు రూ.26 వేల వేతనం ఇస్తుండగా, నల్లగొండ డిపోలో మాత్రం రూ.20 వేలే చెల్లిస్తూ వివక్ష చూపుతున్నారని వాపోయారు.
డ్యూటీలు నిలిపివేసిన సోమయ్య, మురళి, కృష్ణారెడ్డితో పాటు మరో 15 మంది డ్రైవర్లను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. డ్రైవర్ల ఆందోళనకు మద్దతుగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండీ సలీం డిపోకు చేరుకుని నిరసనలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో జేబీఎం సిస్కాన్ సంస్థ ప్రతినిధులు డ్రైవర్లు, యూనియన్ నేతలతో చర్చలు జరిపారు. వచ్చే నవంబర్ 4న యాజమాన్యంతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి వేతనాల పెంపుతో పాటు ఇతర సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో సంతృప్తి చెందిన డ్రైవర్లు మూడు గంటల తర్వాత ఆందోళన విరమించి తిరిగి విధుల్లో చేరారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు దండెంపల్లి సత్తయ్య, ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) నల్లగొండ డిపో అధ్యక్షుడు కాసాన్ రమేష్, కార్యదర్శి పొట్టపాంగి గణేష్, కోశాధికారి పూల సోమన్న నాయుడు, ఉపాధ్యక్షుడు సింగపంగా మురళి, మచ్చ నాగార్జున, జల్లుల వీరారెడ్డి, బొడ్డుపల్లి సైదులు తదితరులు పాల్గొన్నారు.

