కలం, వెబ్ డెస్క్ : అభివృద్ధి మాటలు వినిపిస్తున్నా మారుమూల గిరిజన గ్రామాల్లో కనీస రహదారి సౌకర్యాలు అందుబాటులోకి రావడం లేదనే పరిస్థితికి మరో ఘటన అద్దం పట్టింది. తొమ్మిది నెలల గర్భిణీకి (Pregnant Woman) అర్ధరాత్రి పురిటినొప్పులు రావడంతో ఆస్పత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్డు సదుపాయం లేకపోవడంతో సుమారు మూడు కిలోమీటర్ల దూరం డోలీలో (Doli) మోసుకెళ్లాల్సి వచ్చింది.
అల్లూరి జిల్లా అనంతగిరి మండలం తలారుపాడు (Thalarupadu) గ్రామానికి చెందిన నీలిమ తొమ్మిది నెలల గర్భిణీ. అర్ధరాత్రి సమయంలో ఆమెకు పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడటంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఏర్పాట్లు చేశారు. అయితే గ్రామానికి సరైన రహదారి లేకపోవడంతో వాహనం వచ్చే అవకాశం లేకుండా పోయింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో నీలిమను డోలీలో పడుకోబెట్టి సుమారు మూడు కిలోమీటర్ల మేర మోసుకెళ్లి ఆస్పత్రిలో చేర్చారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో వేల కిలోమీటర్ల రహదారులు నిర్మించామని ప్రచారం చేస్తున్న పాలకులు, తమ గ్రామాలకు కనీస రోడ్డు సౌకర్యం ఎందుకు కల్పించడం లేదని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. గర్భిణులు, వృద్ధులు, అత్యవసర వైద్యం అవసరమైన వారు ప్రతిసారీ ఇలాంటి ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read : రాప్తాడు పాఠశాలలో దారుణం.. విద్యార్థినిపై రంపంతో దాడి!
Follow Us On : WhatsApp

