కలం, ఖమ్మం బ్యూరో: ఆమె నడవలేదు.. కాళ్ళు తడబడుతున్నాయి. చూపు మందగించింది.. కళ్ళు కన్నీటి చెలమలయ్యాయి. ఒకటా రెండా.. ఎనభై ఐదేళ్ల సుదీర్ఘ జీవితం ఆమెది. ముగ్గురు కొడుకులను కంటికి రెప్పలా సాకి పెద్ద చేసింది. వృద్ధాప్యంలో ఆ కొడుకులే తనకు నీడవుతారని ఆశపడింది. కానీ, కన్నకొడుకే కాలయముడయ్యాడు.. ఆస్తి పాస్తులు రాసిచ్చేంతవరకు అమ్మ అన్నాడు, కాగితాలపై సంతకాలు తీసుకోగానే అనాథను చేశాడు. నమ్మించి గొంతు కోసిన పెద్దకొడుకు, కోడలి బారి నుండి తనను కాపాడాలంటూ భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా పాల్వంచ మండలం కరకవాగుకు చెందిన భట్టు కోమి అనే 85 ఏళ్ల వృద్ధురాలు సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్‌లో కన్నీటి పర్యంతమైన తీరు అక్కడున్న ప్రతి ఒక్కరి గుండెలను పిండేసింది.
ఆమెకు ముగ్గురు కొడుకులు
భట్టు కోమికి ముగ్గురు కొడుకులు. అందులో ఒక కొడుకు భట్టు రవి దివ్యాంగుడు కాగా, మరో కుమారుడు భట్టు శ్రీనివాస్ మతిస్థిమితం లేనివాడు. కళ్లముందే ఇద్దరు కొడుకులు అలా దీనావస్థలో ఉంటే ఆ తల్లి గుండె ఎంతలా తల్లడిల్లిపోయిందో చెప్పనక్కర్లేదు. కనీసం సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్న పెద్దకొడుకు భట్టు రామ్‌దాన్ అయినా తమ్ముళ్లను, తనను చూసుకుంటాడని ఆ తల్లి ఆశపడింది. రామ్‌దాన్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. సమాజానికి బుద్ధులు చెప్పే గురుతర బాధ్యత కలిగిన ఆ కొడుకు, కన్నతల్లి విషయంలో మాత్రం కర్కశంగా మారాడు.
ఆస్తి కోసం పన్నిన వల
”నువ్వు నా దగ్గరే ఉండు అమ్మా.. నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటా.. నువ్వు చనిపోయాక నీ కర్మకాండలు కూడా నేనే దగ్గరుండి చేస్తా” అంటూ ఆ పెద్దకొడుకు నమ్మబలికాడు. కన్నకొడుకు మాటలను నమ్మి ఆ తల్లి, కొడుకు ఇంటికి వెళ్ళింది. కానీ, అక్కడ ఆమెకు ఎదురైంది ఆదరణ కాదు.. ఆస్తి కోసం పన్నిన వల. ఇంటి స్థలంతో పాటు నాలుగున్నర ఎకరాల పొలం కాగితాలపై ఆ వృద్ధురాలి చేత బలవంతంగా సంతకాలు చేయించుకున్నాడు.
ఆస్తి చేతికి రాగానే.. బయటపడ్డ అసలు రంగు
ఆస్తి చేతికి రాగానే ఆ కొడుకు, కోడలి అసలు రంగు బయటపడింది. సంతకాలు పెట్టే వరకు ‘అమ్మా’ అన్న నోరే.. ఇప్పుడు దుర్భాషలాడుతోంది. అన్నం పెట్టకుండా ఆకలితో అలమటించేలా చేస్తున్నారు. అంతటితో ఆగక ఆ వృద్ధురాలిపై చేతులు చేసుకుంటూ శారీరకంగా, మానసికంగా నరకం చూపిస్తున్నారు. ఆఖరికి ప్రభుత్వం ఇచ్చే ఆసరా పెన్షన్ డబ్బులను కూడా ఆ నిర్దయుడు లాగేసుకుంటున్నాడని ఆ వృద్ధురాలు కలెక్టరేట్‌లో విలపించిన తీరు స్థానికులను కన్నీరు పెట్టించింది.
”నా భూమి నాకు ఇప్పించండి.. నా పెన్షన్ డబ్బులు నాకు ఇప్పించి.. నా కొడుకు, కోడలు బారి నుండి నన్ను రక్షించండి సామీ..” అంటూ ఆ వృద్ధురాలు కలెక్టర్ ఎదుట చేతులెత్తి మొరపెట్టుకుంది. వృద్ధురాలి దీనగాథను విన్న కలెక్టర్ అంకిత్ తీవ్రంగా చలించిపోయారు. సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు కన్నతల్లి పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బాధితురాలి అంశంపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి, వృద్ధురాలికి న్యాయం చేయాలని ఆర్డీవో (RDO) ను ఆదేశిస్తూ వెంటనే లేఖ రాశారు.
చదువు నేర్పే గురువు, కన్నతల్లికి అన్నం పెట్టకుండా నడిరోడ్డుపైకి నెట్టడం విద్యావ్యవస్థకే సిగ్గుచేటు. కలెక్టర్ స్పందించి లేఖ రాశారు.. మరి అధికారులు ఎంత వేగంగా స్పందించి ఆ తల్లికి ఆమె భూమిని, పెన్షన్‌ను తిరిగి ఇప్పించి, ఆ కొడుకుపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

