కలం, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలోని థానే జిల్లా భివండిలో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కోహినూర్ అపార్ట్మెంట్లో ఒక భాగం (Bhiwandi Building) ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. నిన్న రాత్రి జరిగిన ఈ ప్రమాదంతో స్థానికులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. నాలుగు అంతస్తుల భవనం కావడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రస్తుతం శిథిలాల కింద మరో నలుగురు నుంచి ఐదుగురు చిక్కుకుపోయినట్లు సమాచారం.
మహారాష్ట్రలోని థానే జిల్లా భీవండి నగరంలో జరిగిన భవన ప్రమాద బాధితులను ఆదుకునేందుకు సహాయక బృందాలు వేగంగా స్పందించాయి. బాలాజీ నగర్ ప్రాంతంలోని కోహినూర్ భవనంలో గురువారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే స్పందించిన నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), థానే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (TDRF) స్థానిక అగ్నిమాపక సిబ్బంది సంయుక్తంగా రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు.
శిథిలాల కింద చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు ఆధునిక సాంకేతిక పరికరాలు, డాగ్ స్క్వాడ్స్, భారీ యంత్రాలను రంగంలోకి దించారు. సహాయక చర్యల ద్వారా ఇప్పటికే ఒక బాలుడిని సురక్షితంగా రక్షించి చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాద తీవ్రతను గమనించిన అధికారులు స్థానికులను అప్రమత్తం చేసి, చుట్టుపక్కల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేపట్టారు. ప్రమాద స్థలంలో క్షతగాత్రులకు తక్షణ వైద్య సాయం అందించేలా అంబులెన్స్ సేవలను కూడా అందుబాటులో ఉంచారు. మిగిలిన వారిని కాపాడటమే లక్ష్యంగా సహాయక చర్యలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి.

