ఎల్‌ నినోతో దేశవ్యాప్తంగా విద్యుత్ సంక్షోభం.. పలు రాష్ట్రాల్లో కోతలు

కలం, తెలంగాణ బ్యూరో: వ్యవసాయ విద్యుత్ సరఫరాలో కష్టాలు తెలంగాణలో మాత్రమే ఉన్నాయా? ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి సమస్యలే ఉన్నాయా? ఇతర రంగాలకు డిమాండ్‌కు సరిపడా విద్యుత్ సరఫరా అవుతున్నదా?.. ఇలాంటి అనేక ప్రశ్నలకు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) లెక్కలతో సహా వివరణ ఇచ్చింది. ఎల్‌నినో కారణంగా అన్ని రాష్ట్రాల్లోనూ విద్యుత్ సరఫరాలో సమస్యలు (Power Crisis) ఉన్నాయని వెల్లడించింది. చాలా రాష్ట్రాల్లో వ్యవసాయానికి కరెంట్ 10 గంటలకు మించి సరఫరా కావడం లేదని తెలిపింది.

బీజేపీ అధికారంలో ఉన్న మహారాష్ట్రలో వ్యవసాయానికి ప్రతి రోజు 8 గంటల సప్లై ఉండాలని ఏప్రిల్‌లోనే సర్క్యులర్ జారీ అయింది. గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ లాంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ కరెంట్ కొరత ఉన్నది. ఏప్రిల్-ఆగస్టు మధ్య డిమాండ్‌కు తగ్గట్టు సప్లై లేదని సీఈఏ క్లారిటీ ఇచ్చింది. ఎల్‌ నినో ఎఫెక్టుతో వ్యవసాయ రంగానికి మాత్రమే కాకుండా గ్రామీణ, పట్టణ, పారిశ్రామిక అవసరాలకు సైతం అదనపు కరెంట్‌ను సమకూర్చుకోవడంలో ఇబ్బందులున్నట్లు పేర్కొంది.

తెలంగాణలోనే బెటర్..

దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణలోనే విద్యుత్ సరఫరా మెరుగ్గా ఉన్నది. అన్ని రంగాల అవసరాలకు డిమాండ్‌కు తగినంత కరెంట్ సప్లై అవుతున్నది. ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో డిమాండ్‌కు తగినంత సప్లై లేదు. కేరళలో గత ఐదు నెలల్లో 311 మెగావాట్ల విద్యుత్ కొరత నెలకొంటే, తెలంగాణలో అది కేవలం 3 మెగావాట్లే. తమిళనాడులో 69, కర్నాటకలో 36, ఆంధ్రప్రదేశ్‌లో 6 మెగావాట్ల చొప్పున షార్టేజీ ఉన్నది.

జల విద్యుత్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యే ఉత్తరాఖండ్‌లో సైతం అవసరాలకు తగినంత సరఫరా కావడం లేదు. ఎల్‌నినో కారణంగానే కరెంట్ కొరత ఏర్పడిందన్నది విద్యుత్ నిపుణుల అభిప్రాయం. ఈసారి ఎల్‌ నినో ప్రభావంతో వర్షాకాలంలోనే సమ్మర్ కంటే ఎక్కువగా విద్యుత్ డిమాండ్ ఉన్నది. జల విద్యుత్ ఉత్పత్తితో పాటు బొగ్గు కొరతతో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కూడా తగ్గింది. దీంతోనే కరెంట్ కోతలు మొదలయ్యాయని నిపుణులు పేర్కొంటున్నారు.

రైతుల ఆందోళన..

ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్ర రైతాంగానికి ఎల్‌ నినో కష్టాలు మొదలయ్యాయి. రానున్న రెండు మూడు నెలల్లో ఇది మరింత తీవ్ర రూపం దాల్చనున్నది. ఎల్‌ నినో కారణంగా కృష్ణా, గోదావరి నదుల్లో వరదలు కనిష్ట స్థాయిలోనే ఉన్నాయి. రాష్ట్రంలోని రిజర్వాయర్లలో నీటి నిల్వలు పెద్దగా పెరగలేదు. ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందుగానే అప్రమత్తమైన రాష్ట్ర సర్కార్.. ఆరు తడి పంటలు వేయాల్సిందిగా రైతులకు సూచించింది. వరి పంటకు అవసరమైనంత నీరు ఉండకపోవచ్చని, రైతులు ఆ పంట సాగు తగ్గించాలని కోరింది.

కాల్వల ద్వారా సాగునీరు రాకపోవడంతో రైతులు బోరు బావులపై ఆధారపడుతున్నారు. కానీ కరెంటు కోతలతో పంపులను ఆన్ చేయలేకపోతున్నామంటూ కొన్ని గ్రామాల్లో సబ్ స్టేషన్ల ముందు ధర్నాలు చేస్తున్నారు. కొన్ని చోట్ల రాత్రిపూట కరెంటు సప్లై లేదనే ఆరోపణలు ఉంటే, మరికొన్ని చోట్ల సింగిల్ ఫేజ్ సప్లై మాత్రమే ఉందని, ఇంకొన్ని చోట్ల లో-వోల్టేజీతో మోటార్లు కాలిపోతున్నాయన్నది రైతుల ఆవేదన. ఇలాంటి వాటికి ప్రభుత్వం నుంచి సమాధానం లేకపోవడంతో రైతుల్లో అలజడి నెలకొన్నది.

విద్యుత్ శాఖ మంత్రి మౌనం!

ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి విపక్షాలు వ్యవసాయ విద్యుత్ అంశాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాయి. కేసీఆర్ హయాంలో 24 గంటల సప్లై ఉంటే ఇప్పుడది 10 గంటలు కూడా దాటడం లేదని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు ప్రతిరోజూ విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ అంటేనే కరెంట్ కోతలకు కేరాఫ్ అడ్రస్ అని ఆరోపిస్తున్నారు. సబ్ స్టేషన్లకు వెళ్ళి లాగ్‌బుక్‌లలో కరెంటు సప్లై లెక్కలను తీస్తున్నారు. ఆందోళనలో ఉన్న రైతులను స్థానిక బీఆర్ఎస్ లీడర్లు రెచ్చగొడుతున్నారు.

అయినప్పటికీ కరెంట్ సరఫరాలో లోపాలపై విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎం నుంచి వివరణ కరువైంది. శాసనమండలిలో సభ్యులు లేవనెత్తిన అంశానికి ఆయన స్పందిస్తూ.. ‘‘ఈ పాపమంతా ఎల్‌ నినోదే.. ప్రభుత్వ లోపం లేదు. ఎల్‌ నినో కారణంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. విద్యుత్ వినియోగం బాగా పెరిగింది. సమ్మర్‌‌లో లాగా డిమాండ్ ఉన్నది” అని పేర్కొన్నారు. కానీ వ్యవసాయానికి ఇచ్చే విద్యుత్ సరఫరాలోని లోపాలపై మాత్రం వివరణ ఇవ్వలేదు.

ఏప్రిల్-ఆగస్టు మధ్య విద్యుత్ డిమాండ్ (మెగావాట్లలో)- రాష్ట్రం డిమాండ్ సరఫరా

పంజాబ్ 17,672        17,017
ఉత్తరప్రదేశ్ 33,197     32,674
మహారాష్ట్ర 32,430      32,317
కేరళ 6,488                6,178
తమిళనాడు 21,471     21,402
కర్నాటక 18,514         18,478
ఆంధ్రప్రదేశ్ 15,019    15,014
తెలంగాణ 17,005      17,002

విద్యుత్ వినియోగం (మిలియన్ యూనిట్లలో) – రాష్ట్రం డిమాండ్ సరఫరా

పంజాబ్ 41,869         41,569
ఉత్తరప్రదేశ్ 86,137    86,127
మహారాష్ట్ర 92,125      91,954
కేరళ 14,224            14,193
తమిళనాడు 63,915   63,906
కర్నాటక 45,806       45,786
ఆంధ్రప్రదేశ్ 40,338   40,332
తెలంగాణ 40,287      40,280
గుజరాత్ 75,041       74,983

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>