కలం, వెబ్ డెస్క్: పార్లమెంట్లో కాంగ్రెస్ (Congress) ఎంపీలు నిరసన చేపట్టారు. ప్రియాంక గాంధీ సహా పలువురు కీలక ఎంపీలు బ్యానర్లు పట్టుకుని ఆందోళన చేశారు. ఢిల్లీలో ఆందోళనకారులపై పెల్లెట్ గన్స్ ఎందుకు ఉపయోగించారో.. సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా దీనిపై స్పందించాలన్నారు. పార్లమెంట్ నుంచి ఆయన ఎందుకు పారిపోతున్నారని మండిపడ్డారు. శాంతియుతంగా నిరసనలు చేసినవారిపై పెల్లెట్ గన్స్ ఎలా వాడుతారని ప్రశ్నించారు.
ఆదేశాలు ఎవరు ఇచ్చారు..?
కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ మాట్లాడుతూ.. ఆందోళనకారులపై కాల్పులు జరపాలని ఎవరు ఆదేశాలిచ్చారో పార్లమెంట్‌కి చెప్పాలని డిమాండ్ చేశారు. సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశాలు లేకుండానే ఆ పని చేశారా.. అని ప్రశ్నించారు. బీజేపీ ఈ అంశాన్ని మొదట తిరస్కరించిందని.. రాహుల్ గాంధీ ఆధారాలు చూపించడంతో మిన్నకుండిపోయిందన్నారు. పెల్లెట్ గన్స్ వాడటంతో పలువురికి తీవ్ర గాయాలైనట్లు కపిల్ సిబల్ పేర్కొన్నారు.

