కలం, నేషనల్ డెస్క్ : ఎల్ నినో (El Nino) ఊహించని స్థాయిలో బలపడుతున్నది. గతంలో ఎన్నడూ లేనివిధంగా తీవ్ర రూపం దాల్చుతున్నది. పసిఫిక్ మహాసముద్రం(Pacific Ocean)లో రగులుతున్న ఎల్ నినో.. ఇప్పటికే ప్రపంచ వాతావరణాన్ని అతలాకుతలం చేస్తున్నది. 2026 చివరి నాటికి ఇది అత్యంత తీవ్ర రూపం దాల్చి.. 2027లోనూ కొనసాగే ప్రమాదం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) గురువారం హెచ్చరించింది.
వ్యవసాయం నుంచి నీటి వనరుల వరకు.. ఆరోగ్యం నుంచి విద్యుత్ సరఫరా వరకు.. అనేక రంగాలను ఎల్ నినో కుదిపేసే ప్రమాదం ఉందని డబ్ల్యూఎంవో ఆందోళన వ్యక్తం చేసింది. పసిఫిక్ మహాసముద్రంలో పరిస్థితి ఇప్పటికే ఆందోళనకరంగా మారింది. ఎల్ నినోకు కీలకమైన మధ్య, తూర్పు భూమధ్యరేఖా పసిఫిక్ ప్రాంతంలో.. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఏకంగా 2.2 నుంచి 2.6 డిగ్రీల సెల్సియస్ వరకు అధికంగా నమోదవుతున్నాయి.
సముద్రం అడుగుభాగంలోనూ వేడి మరింత ఎక్కువగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే 8 డిగ్రీల సెల్సియస్ వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు డబ్ల్యూఎంవో తెలిపింది. ఈ అసాధారణ వేడి రానున్న నెలల్లో ఎల్ నినో మరింత బలపడేందుకు దోహదం చేస్తున్నదని పేర్కొంది. ఈ ఏడాది చివరినాటికి తీవ్రత గరిష్ఠ స్థాయికి చేరే అవకాశం ఉండగా.. 2027 ఫిబ్రవరి వరకు ఎల్ నినో కొనసాగేందుకు దాదాపు 100 శాతం అవకాశం ఉందని డబ్ల్యూఎంవో అంచనా వేసింది.
ప్రపంచానికి ముప్పు
ఎల్ నినో (El Nino) తీవ్రత పెరిగే కొద్దీ దాని ప్రభావం కూడా ప్రపంచవ్యాప్తంగా విస్తరించే ప్రమాదం ఉంది. తీవ్ర ఎండలు, కరువులు ఒకవైపు.. భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు మరోవైపు పెరగొచ్చు. ముఖ్యంగా వ్యవసాయం, నీటి వనరులు, మత్స్యరంగం, విద్యుత్, ఆరోగ్యం, రవాణా వంటి రంగాలపై ప్రభావం పడే అవకాశం ఉందని డబ్ల్యూఎంవో తెలిపింది.
భారత్ తో పాటు దక్షిణాసియాలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉండగా.. ఇతర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉంది. అందుకే ఇది కేవలం వాతావరణ పరిణామం కాదని.. ఆహారం, నీరు, ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపించే బహుముఖ ముప్పుగా మారొచ్చని డబ్ల్యూఎంవో ఆందోళన వ్యక్తం చేసింది.
50 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా..
ఇంతటి పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ దేశాలను డబ్ల్యూఎంవో అప్రమత్తం చేసింది. జాతీయ వాతావరణ, జలవనరుల సంస్థలు అత్యవసరంగా సన్నద్ధం కావాలని సూచించింది. ఎల్ నినో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి.. వ్యవసాయం, నీరు, ఇంధనం, ఆరోగ్య రంగాలపై పడే నష్టాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని డబ్ల్యూఎంవో సెక్రటరీ జనరల్ సెలెస్టే సాలో పిలుపునిచ్చారు. డబ్ల్యూఎంవో 50 ఏళ్ల చరిత్రలో ఇంతటి స్థాయిలో జాతీయ వాతావరణ సంస్థలను సమీకరించడం ఇదే తొలిసారని ఆమె పేర్కొన్నారు. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేసి.. ప్రాణ, ఆస్తి నష్టాలను వీలైనంత వరకు నివారించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
ముంచుకొస్తున్న ఆహార సంక్షోభం
ఎల్ నినో ప్రభావంతో సామాన్యుడిపై ఆర్థిక భారం కూడా పెరగనుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గోధుమ ధరలు గతేడాదితో పోలిస్తే సుమారు 45 శాతం, బియ్యం 31 శాతం, సోయాబీన్, మొక్కజొన్న ధరలు 27 శాతానికి పైగా పెరిగాయి. వాతావరణ మార్పుల వల్ల పంటల దిగుబడి తగ్గి, రాబోయే నాలుగు ఐదు నెలల్లో పాలు, చక్కెర, గుడ్లు, గోధుమల వంటి ప్రాథమిక ఆహార పదార్థాల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ సంక్షోభం వల్ల 2027 నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 5 కోట్ల మంది కరువు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఐక్యరాజ్యసమితి కూడా హెచ్చరించింది.
Also Read : ఇస్రో ఖాతాలో మరో విజయం.. నింగిలోకి GSLV-F17
Follow Us On: X(Twitter)

