కలం, వరంగల్ బ్యూరో: మంత్రివర్గం నుంచి కొండా సురేఖ (Konda Surekha) బర్తరఫ్ కావడం వరంగల్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఇంతకాలం వరంగల్ రాజకీయాల్లో తమదైన ముద్ర వేసిన కొండా కుటుంబానికి తాజా పరిణామం షాక్ ఇచ్చినట్లయింది. ఇప్పుడు సురేఖ రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఆమె వెంట ఎంతమంది అనుచరులు నిలుస్తారు? కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా? లేక కొత్త రాజకీయ వ్యూహాన్ని ఎంచుకుంటారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
హైదరాబాద్‌లోనే మకాం
= బర్తరఫ్ నేపథ్యంలో అనుచరులతో మాట్లాడి కొండా సురేఖ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని తొలుత ప్రచారం జరిగింది. కానీ ఆమె వరంగల్‌కు రాకుండా హైదరాబాద్‌లోనే ఉండటంతో.. పరిస్థితిని పూర్తిగా అంచనా వేసిన తర్వాతే తదుపరి అడుగు ఆమె భావిస్తున్నారా? అనుచరుల స్పందనపై స్పష్టత వచ్చే వరకు వేచి చూస్తున్నారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
= పదవి పోయిన తర్వాత క్యాడర్ ఎటు వైపు ఉంటుందనేది ప్రశ్నార్థకంగా మారింది. కొండా కుటుంబ రాజకీయ బలానికి అనుచరులు, స్థానిక నాయకులతో ఏర్పడిన సంబంధాలే కీలకం.
= ఇప్పుడు ఎవరు బహిరంగంగా కొండా కుటుంబం వెంట నిలుస్తారు? ఎవరు మౌనం పాటిస్తారు? అనేది ఉత్కంఠగా మారింది.
= సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించిన తర్వాత ఆమె అనుచరులు గానీ, ముఖ్య నాయకులు గానీ నోరు మెదపకపోవడం ఆసక్తికరంగా మారింది.
= అయితే ఇప్పుడే ఓ నిర్ణయానికి రాలేమని, అసలు కొండా కుటుంబానికి క్షేత్రస్థాయిలో ఉన్న బలం ఎంత? అనేది రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలతోనే తేలుతుందన్నది రాజకీయ విశ్లేషకుల వాదన.
వరంగల్ తూర్పులో మళ్లీ గెలుస్తారా?
కొండా సురేఖ రాజకీయ ప్రస్థానంలో వరంగల్ తూర్పు కీలక నియోజకవర్గం. ఆమె ఇక్కడ 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున 67,757 ఓట్లు సాధించి 15,652 ఓట్ల మెజార్టీతో గెలిచారు. దీంతో నియోజకవర్గంలో తనకు వ్యక్తిగతంగా రాజకీయ బలం ఉందని నిరూపించుకున్నారు. అయితే గతంతో పోల్చితే మెజార్టీ గణనీయంగా తగ్గడం ఇప్పుడు చర్చకు కారణమవుతోంది. 2014లో ఇదే నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలిచిన సురేఖకు 2023లో అంతటి ఆధిక్యం దక్కలేదు. దీనికి తోడు ప్రస్తుతం అధికార పార్టీతో విభేదాలు, స్థానిక రాజకీయ సమీకరణాల్లో మార్పులు చోటుచేసుకోవడంతో వచ్చే ఎన్నికల్లోనూ అదే స్థాయిలో విజయం సాధించగలరా? అన్నది ప్రశ్నగా మారింది.
పరకాలలో ప్రభావమెంత?
కొండా కుటుంబానికి పరకాలతోనూ పాత రాజకీయ అనుబంధం ఉంది. భవిష్యత్‌లో వరంగల్ ఈస్ట్ కాకుండా పరకాల (Parakala) నుంచి రాజకీయ పునరాగమనానికి సురేఖ ప్రయత్నిస్తారా? అనే చర్చ కూడా మొదలైంది. గతంలో పరకాలలో ఓటమి తర్వాతే ఆమె వరంగల్ తూర్పులోకి ప్రవేశించారు. అయితే పరకాలలో ప్రస్తుతం కాంగ్రెస్ నుంచే రేవూరి ప్రకాశ్‌రెడ్డి (Revuri Prakash Reddy) ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సురేఖ అక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటే పార్టీ అంతర్గత సమీకరణాలు కీలకంగా మారనున్నాయి.
ఈ తరుణంలో ఈస్ట్‌లో కొనసాగడమా? పరకాలకు మారడమా? లేక మరో రాజకీయ మార్గాన్ని ఎంచుకోవడమా? అనేది ఆసక్తికరంగా మారింది. తన కూతురు సుష్మితకు పరకాల టికెట్ విషయంలోనే సురేఖ మంత్రి పదవి కోల్పోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో సురేఖ (Konda Surekha) ఈస్ట్ లోనే కొనసాగి, కూతురు సుష్మితను పరకాల నుంచి బరిలోకి దింపే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
సుష్మిత భవిష్యత్తుపై చర్చ
తాజా వివాదానికి కేంద్రంగా నిలిచిన కొండా సుస్మిత రాజకీయ భవిష్యత్ కూడా ఇప్పుడు చర్చలోకి వచ్చింది. సురేఖ మంత్రి పదవిని కోల్పోయిన నేపథ్యంలో సుష్మితను రాజకీయంగా ముందుకు తీసుకెళ్లడం కొండా కుటుంబానికి సవాలుగా మారింది. వచ్చే ఎన్నికల్లో ఆమెను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొస్తారా? ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపుతారు? ప్రస్తుత వివాదం రాజకీయ అవకాశాలపై ప్రభావం చూపుతుందా? అన్నది ప్రశ్న.
స్థానిక ఎన్నికలే తొలి పరీక్ష
రాబోయే మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలు కొండా కుటుంబానికి తొలి పరీక్షగా మారే అవకాశం ఉంది. ఇంతకాలం తమకు వెంట ఉన్న నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు ఎంతమేరకు సహకరిస్తారు? అనేది అక్కడే స్పష్టమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ స్థానిక ఎన్నికల్లో కొండా వర్గం ప్రభావం తగ్గితే.. అది భవిష్యత్ అసెంబ్లీ రాజకీయాలపైనా పడే అవకాశం ఉంది. అదే సమయంలో కొండా కుటుంబం క్యాడర్‌ను తనవైపు నిలుపుకుని రాజకీయంగా బలమైన ప్రదర్శన చేస్తే.. “పదవి పోయినా కొండా పట్టు పోలేదు” అనే సంకేతం వెళ్లే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read : మానవాళికి ‘ఎల్ నినో’ గండం.. WMO హెచ్చరిక!
Follow Us On: X(Twitter)

