కలం, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశించి షాద్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ (Veerlapally Shankar) చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. మంగళవారం హైదరాబాద్లో మాట్లాడిన ఆయన తెలంగాణకు పట్టిన పీడ కేసీఆర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కేసీఆర్ చనిపోవాలని తాము కోరుకుంటున్నామని వ్యాఖ్యానించారు. కేసీఆర్కు వ్యతిరేకంగా నిర్వహించే కార్యక్రమాల సందర్భంగా వెయ్యి డప్పులతోనే పరిమితం కాకుండా మరింత ముందుకెళ్లి చావు డప్పు కొడతామని ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రజాప్రతినిధి స్థాయిలో ఉన్న నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
బీఆర్ఎస్ నేతల ఆగ్రహం
మరోవైపు వీర్లపల్లి శంకర్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయడం సహజమే అయినప్పటికీ, వ్యక్తిగతంగా మరణాన్ని కోరుకునే స్థాయిలో వ్యాఖ్యలు చేయడం సరికాదని వారు మండిపడుతున్నారు. ఇక ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వీర్లపల్లి శంకర్ తాజా వ్యాఖ్యలు ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధాన్ని మరింత వేడెక్కించే అవకాశం ఉంది.

