కలం, వెబ్ డెస్క్ : ఏపీ లిక్కర్ స్కామ్ కేసుపై (Liquor Scam Case) ఈడీ అధికారులు దూకుడు పెంచారు. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijaysai Reddy) నివాసంపై ఈడీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ మేరకు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో తనిఖీలు చేపట్టారు. విజయసాయి రెడ్డిని నేరుగా ప్రశ్నిస్తున్న ఈడీ అధికారులు.. ఆయన నుంచి కీలక ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు. కాగా, 2019-24 మధ్య కాలంలో వైఎస్ జగన్ హయాంలో అమలు చేసిన మద్యం పాలసీలో భారీగా అవకతవకలు జరిగాయని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. మద్యం విక్రయాల్లో నగదు లావాదేవీలకే ప్రాధాన్యత ఇవ్వడం, డిజిటల్ చెల్లింపులను పక్కనపెట్టడం వెనుక కుట్రకోణం దాగి ఉందని ఆరోపణలున్నాయి.
ఈ క్రమంలోనే విజయసాయి రెడ్డి (Vijaysai Reddy) ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను ఈడీ అధికారులు సేకరిస్తున్నారు. వైసీపీ పాలనలో మద్యం ఆదాయం ఎక్కడకు మళ్లింది? షేల్ కంపెనీల ద్వారా మనీలాండరింగ్ జరిగిందా? అనే కోణంలో విచారణ జరుగుతోంది. మద్యం పాలసీ తయారీలో ఆయన పాత్ర, మద్యం సరఫరా చేసే కంపెనీలతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే మద్యం కుంభకోణం కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న విజయసాయి రెడ్డిని సిట్ అధికారులు ఓ సారి ప్రశ్నించారు. కానీ అరెస్ట్ మాత్రం చేయలేదు. అప్రూవర్‌గా మారి కీలక వివరాలు అందించడంతోనే ఆయన్ని అరెస్ట్ చేయకుండా వదిలేశారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈడీ (ED) అధికారులు విజయసాయి రెడ్డిని విచారించడం హాట్ టాపిక్ గా మారింది. విజయసాయి రెడ్డిపై ఈడీ ఏదైనా యాక్షన్ తీసుకుంటుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.
Read Also: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్
Follow Us On: Sharechat

