కలం, స్పోర్ట్స్ : తమ ప్లేయర్లపై కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్(ECB) ఆలోచిస్తోంది. యాషెస్ సిరీస్‌లో ఘోర పరాజయం తర్వాత ఇంగ్లండ్ జట్టులో క్రమశిక్షణపై ఆందోళనలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఆటగాళ్లకు కఠిన కర్ఫ్యూ నిబంధనలు (Curfew for England Players ) అమలు చేయాలని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఆలోచిస్తోంది. మద్యం తాగడం, మైదానం బయట అనుచిత ప్రవర్తనపై వచ్చిన ఆరోపణలే ఈ నిర్ణయానికి దారితీశాయి. ఆస్ట్రేలియా పర్యటనలో ఆటగాళ్లు తరచూ రాత్రివేళల వరకు మద్యం తాగడం, కాసినోలను సందర్శించడం జరిగిందన్న కథనాలు వెలుగులోకి వచ్చాయి. బ్రిస్బేన్ టెస్టుల మధ్య ఆరు రోజుల విరామంలో పరిస్థితి “స్టాగ్ వీకెండ్”లా మారిందన్న విమర్శలు వినిపించాయి.
Curfew for England Players | దాంతో ఇప్పుడు శ్రీలంక పర్యటన నుంచి ప్రారంభమై టీ20 ప్రపంచకప్ వరకు జట్టును కఠిన నియంత్రణలో ఉంచాలని ఈసీబీ భావిస్తోంది. గతంలోనూ ఇలాంటి కర్ఫ్యూలు అమలయ్యాయి. అయితే 2022లో అప్పటి కెప్టెన్ బెన్ స్టోక్స్ అవి రద్దు చేయగా ఇప్పుడు మళ్లీ అదే అంశం చర్చకు వచ్చింది. జనవరి 22 నుంచి శ్రీలంకలో జరిగే వన్‌డే టీ20 సిరీస్ ఈ కొత్త క్రమశిక్షణ విధానానికి తొలి పరీక్షగా మారే అవకాశం ఉంది. ఫిబ్రవరి 8న నేపాల్‌తో జరిగే ప్రపంచకప్ తొలి మ్యాచ్‌కు ముందు ఈసీబీ తీసుకునే నిర్ణయం ఇంగ్లాండ్ జట్టు భవిష్యత్తును ప్రభావితం చేయనుంది.


