కలం, స్పోర్ట్స్ : భారత క్రికెట్ అభిమానులకు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) ఒక అదిరిపోయే శుభవార్త చెప్పింది. త్వరలో జరగబోయే భారత్-ఇంగ్లాండ్ టీ20 సిరీస్ (Ind – Eng T20 match) రాత్రి మ్యాచ్‌ల సమయాలను మార్చుతూ కీలక నిర్ణయం తీసుకుంది. భారత కాలమానానికి అనుగుణంగా, ఇక్కడి ప్రేక్షకులు మ్యాచ్‌లను హాయిగా చూసేందుకు వీలుగా ఈ మార్పులు చేశారు. గతంలో ఇంగ్లాండ్‌లో రాత్రి మ్యాచ్‌లు అక్కడ లోకల్ టైమ్ ప్రకారం సాయంత్రం 6:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 11:00 గంటలకు) ప్రారంభమయ్యేవి.
అయితే, ఇంత రాత్రి పూట మ్యాచ్‌లు పెడితే భారత్‌లో వ్యూయర్‌షిప్ తగ్గిపోయే అవకాశం ఉంది. బ్రాడ్‌కాస్టర్ల ఆదాయం, వీక్షకుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ఈసీబీ అధికారులతో చర్చలు జరిపారు. అనంతరం ఈ రాత్రి మ్యాచ్‌లను ఒక గంట ముందుకు జరిపారు. ఇప్పుడు ఇవి అక్కడ సాయంత్రం 5:30 గంటలకే, అంటే మన దేశంలో రాత్రి 10:00 గంటలకే మొదలవుతాయి. ఈసీబీ ఆదాయం ఇలాంటి పెద్ద సిరీస్‌లపైనే ఆధారపడి ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి.
ఈ పర్యటనలో మొత్తం ఐదు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో మూడు మ్యాచ్‌లు ఫ్లడ్‌లైట్ల వెలుతురులో (రాత్రి 10:00 గంటలకు) సాగుతాయి. మిగిలిన రెండు మ్యాచ్‌లు మాత్రం భారత కాలమానం ప్రకారం రాత్రి 7:00 గంటలకే (అక్కడ మధ్యాహ్నం 2:30 గంటలకు) ప్రారంభమవుతాయి. ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్ సిరీస్‌ల తర్వాత టీమిండియా ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది. జూలై 1 నుంచి ఈ టూర్ ప్రారంభం కానుంది. చెస్టర్-లీ-స్ట్రీట్‌లోని రివర్‌సైడ్ గ్రౌండ్‌లో మొదటి టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఈ సిరీస్ ముగిసిన తర్వాత మూడు వన్డేల సిరీస్ కూడా జరగనుంది.
భారత్, ఇంగ్లాండ్ మ్యాచ్‌లంటేనే అభిమానుల్లో ఎప్పుడూ విపరీతమైన క్రేజ్ ఉంటుంది. వన్డే మ్యాచ్‌ల్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మాత్రమే ఆడుతుండటంతో ఆ టికెట్లన్నీ ఇప్పటికే హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. టీ20 మ్యాచ్‌లకు కూడా టికెట్ల అమ్మకాలు బాగున్నాయి. శ్రేయాస్ అయ్యర్ కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడం, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ జట్టులోకి రావడంతో మిగిలిన టీ20 టికెట్లు కూడా త్వరలోనే అమ్ముడవుతాయని భావిస్తున్నారు.

