కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు మరో 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు గురువారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది (EC – SIR). ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) చేపట్టడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని కోరింది. ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియ రాబోయే ఏప్రిల్లో నిర్వహించే అవకాశమున్నందున సాధ్యమైనంత త్వరగా సన్నాహక ఏర్పాట్లు పూర్తి చేయాలని చెప్పింది.
ఈ మేరకు తెలుగు రాష్ట్రాలతోపాటు అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఢిల్లీ, ఒడిశా, పంజాబ్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్, కేంద్ర పాలిత ప్రాంతాల ఎన్నికల ప్రధానాధికారులకు పంపిన లేఖలో పేర్కొంది.
కాగా, కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే 12 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో ‘సర్’ ప్రక్రియ చేపట్టింది (EC – SIR). వీటిలో ఇప్పటికే బిహార్లో పూర్తి కాగా, మరో 9 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతోంది. అలాగే అసోంలో ‘సర్’కు బదులు స్పెషల్ రివిజన్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు ‘సర్’ కు సిద్ధంగా ఉండాలంటూ సీఈసీ ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.


