కలం, నల్లగొండ: రాబోయే బక్రీద్ పండుగను పురస్కరించుకొని మునుగోడు (Munugode) రోడ్డులోని ఈద్గా ప్రాంగణాన్ని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ (SP Sharath Chandra Pawar) బుధవారం సందర్శించారు. ఈద్గా వద్ద ముస్లిం సోదరుల ప్రార్థనల కొరకు చేస్తున్న ఏర్పాట్లను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బక్రీద్ (Bakrid) ప్రార్థనలకు భారీ సంఖ్యలో ముస్లిం భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పలు అంశాలపై సంబంధిత అధికారులకు ఎస్పీ పలు సూచనలు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఈద్గా పరిసరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వాహనాల నియంత్రణ, ముందస్తుగా పార్కింగ్ స్థలాల కేటాయింపులు పక్కాగా ఉండాలన్నారు. ప్రార్థనలకు వచ్చేవారి కోసం తాగునీటి సదుపాయం, ప్రాంగణం అంతటా పరిశుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
“పండుగను అందరూ ప్రశాంతమైన, సామరస్యపూర్వక వాతావరణంలో జరుపుకునేలా పోలీస్ శాఖ అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చూసేందుకు ప్రజలు, యువత పోలీస్ శాఖకు పూర్తి స్థాయిలో సహకరించాలి” అని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ యువతకు ప్రత్యేక సూచనలు చేశారు. పండుగ వేళ సమాజంలో శాంతియుత వాతావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియా వేదికలుగా ఎలాంటి అసత్య ప్రచారాలు, మత విద్వేషాలు లేదా రెచ్చగొట్టే పోస్టులు చేయవద్దని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హెచ్చరించారు. కార్యక్రమంలో నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, ఎస్బీ సీఐ ఆది రెడ్డి, వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డిలతో పాటు జిల్లా గ్రంథాలయ చైర్మన్ హఫీజ్ ఖాన్, డిప్యూటీ మేయర్ ఆమేర్, స్థానిక కార్పొరేటర్లు, ముస్లిం మత పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

