కలం, మెదక్ బ్యూరో: సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం (Duddeda Road Accident) జరిగింది. మతిస్థిమితం లేని దుద్దెడ గ్రామానికి చెందిన ఓ మహిళ రాజీవ్ రహదారిని దాటుతున్న క్రమంలో సిద్దిపేట నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న కారు ఆమెను తప్పించే క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో కారు రోడ్డు పక్కనే ఉన్న ఒక నివాస గృహంలోకి వేగంతో దూసుకుపోయింది.
అయితే ఆ సమయంలో భోజనం చేసి అరుగుపై కూర్చున్న ఓ మహిళ , ఓ చిన్నారి తో పాటు మతిస్థిమితం లేని మహిళ కూడా చనిపోయింది. ప్రమాదంలో మృతి చెందిన మతిస్థిమితం లేని మహిళ పేరు కందుగుల రాధవ్వ, ఇంటి బయట కూర్చుని కారు ప్రమాదం వల్ల మృతి చెందిన మహిళ పేరు కెమ్మసారం లక్ష్మిగా వెల్లడైంది. చనిపోయిన చిన్నారి పేరు తెలియాల్సి ఉంది.
కాగా, కారు యజమాని పేరు అంజలి అన్నారావుగా తెలుస్తోంది. ప్రమాదానంతరం కారులోని వ్యక్తులు కారును అక్కడే వదిలిపెట్టి పారిపోయారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే సిద్దిపేట పోలీస్ కమిషనర్ (CP) రష్మీ పెరుమాళ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదం జరిగిన తీరును, నష్టాన్ని ఆమె స్వయంగా పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
క్రేన్‌తో కారు వెలికితీత
ఇంట్లోకి బలంగా దూసుకుపోవడంతో కారు పూర్తిగా ఇంట్లో ఇరుక్కుపోయింది. పోలీసులు క్రేన్ సహాయంతో కారును ఇంట్లో నుంచి బయటకు తీయించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

