కలం, మెదక్ బ్యూరో: సిద్దిపేట (Siddipet) జిల్లా దుబ్బాక నియోజకవర్గం పరిధిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిరోధించి, ప్లాస్టిక్ రహిత దుబ్బాక లక్ష్యంగా ముందుకు సాగాలని దుబ్బాక ఎమ్మెల్యే (Dubbaka MLA) కొత్త ప్రభాకర్ రెడ్డి (Kotha Prabhakar Reddy) అధికారులను ఆదేశించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి కలిగే నష్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించి, పరిశుభ్రమైన, హరిత దుబ్బాక నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్లాస్టిక్ ను నిషేదించే దిశగా ప్రయత్నం చేయాలని తెలిపారు. దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించిన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్, కమిషనర్, కౌన్సిలర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. వర్షాకాలం నేపథ్యంలో పారిశుద్ధ్య నిర్వహణ, డ్రైనేజీల శుభ్రత, ప్రజారోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పట్టణ అభివృద్ధికి అవసరమైన కొత్త ప్రతిపాదనలు, నిధుల వినియోగం, మౌలిక వసతుల కల్పనపై ప్రణాళిక రూపొందించాలని అన్నారు. దుబ్బాక పరిధిలోని చెరువుల అభివృద్ధి, సుందరీకరణ పనులపై కూడా ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. చెరువులను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించే విధంగా సుందరీకరణ పనులను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే వర్షాకాలంలో నీటి నిల్వలు సక్రమంగా ఉండేలా చెరువుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.

