కలం, వెబ్ డెస్క్: ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు పసిడి మార్కెట్‌ను కూడా కుదిపేస్తున్నాయి. యుద్ధం కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోవడంతో దుబాయ్ నుంచి బంగారం ఎగుమతులు నిలిచిపోయాయి. దీనివల్ల దుబాయ్‌లో భారీగా బంగారం నిల్వలు ఉన్నట్టు సమాచారం. దీంతో అక్కడ బంగారం ధరలు (Gold Prices) గణనీయంగా తగ్గాయి. తాజా నివేదిక ప్రకారం, అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధర కంటే అక్కడ ఔన్సుపై 30 డాలర్ల తక్కువకే బంగారం లభిస్తోంది. ఇది దుబాయ్‌లో ఉన్న లేదా అక్కడికి వెళ్లే భారతీయులకు గొప్ప కొనుగోలు అవకాశంగా కనిపిస్తోంది.
భారతీయులు బంగారం తీసుకురావచ్చా?
దుబాయ్ నుండి భారత్‌కు బంగారం తీసుకురావడానికి కఠినమైన నిబంధనలు ఉన్నాయి. విదేశాల్లో ఏడాది కంటే ఎక్కువ కాలం నివసించిన భారతీయులు ‘డ్యూటీ ఫ్రీ’ కింద కొంత బంగారాన్ని తెచ్చుకోవచ్చు. 2026 బ్యాగేజ్ రూల్స్ ప్రకారం, పురుషులు 20 గ్రాముల వరకు, మహిళలు 40 గ్రాముల వరకు ఆభరణాల రూపంలో పన్ను లేకుండా తీసుకురావడానికి అనుమతి ఉంది. అయితే, బిస్కెట్లు లేదా కాయిన్ల రూపంలో తెస్తే మాత్రం కచ్చితంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పన్ను చెల్లించి గరిష్ఠంగా కిలో వరకు బంగారం తీసుకురావచ్చని, అయితే పర్యాటకులుగా వెళ్లే వారికి ఎటువంటి పన్ను మినహాయింపులు ఉండవని అధికారులు పేర్కొంటున్నారు.
ధరల్లో తేడా ఎంత?
దుబాయ్‌లో దిగుమతి సుంకాలు, జీఎస్టీ లేకపోవడం వల్ల భారత్ కంటే ధర 5 నుండి 7 శాతం తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం యుద్ధం కారణంగా అదనపు తగ్గింపు కూడా లభిస్తోంది. మార్చి 9 నాటి లెక్కల ప్రకారం, దుబాయ్‌లో 10 గ్రాముల బంగారం ధర భారత్ కంటే సుమారు 8,000 నుండి 9,000 రూపాయలు తక్కువగా ఉంది.
భారత్‌లో అమ్మితే లాభం ఉంటుందా?
దుబాయ్‌లో తక్కువ ధరకే దొరుకుతుంది కదా అని అక్కడ కొని భారత్‌లో అమ్మితే భారీ లాభాలు వస్తాయని భావించలేమని నిపుణులు సూరజ్ నంగియా, పృథ్వీరాజ్ కొఠారి అభిప్రాయపడుతున్నారు. డ్యూటీ ఫ్రీ పరిమితి దాటితే 6 శాతం కస్టమ్స్ సుంకం, దానికి తోడు భారత్‌లో అమ్మేటప్పుడు 3 శాతం జీఎస్టీ, కరెన్సీ మార్పిడి ఖర్చులు ఉంటాయని వారు వివరించారు. ఈ ఖర్చులన్నీ పోగా మిగిలే లాభం చాలా స్వల్పమని, పైగా ధరల్లో (Gold Prices) మార్పులు వస్తే నష్టపోయే ప్రమాదం కూడా ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
ఆభరణాల కొనుగోలుకు అనుకూలం
చిన్న మొత్తంలో సొంత అవసరాల కోసం ఆభరణాలను కొనుగోలు చేయడానికి దుబాయ్ మార్కెట్ ప్రస్తుతం అనుకూలంగా ఉంది. అయితే, వాణిజ్యపరమైన లాభాల కోసం భారీగా బంగారం తీసుకురావడం వల్ల చట్టపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందని, సరైన బిల్లులు లేకపోతే కస్టమ్స్ అధికారులు చర్యలు తీసుకుంటారని నిపుణులు సూచిస్తున్నారు.
Read Also: దేశంలోనే రిచెస్ట్ మహిళా ఎమ్మెల్యేలు ఏపీలోనే.. ADR రిపోర్ట్
Follow Us On : WhatsApp

