యూసీసీ అమలుకు టైమ్​ వచ్చింది : సుప్రీంకోర్టు

కలం, వెబ్​ డెస్క్​: ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ)పై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. దేశంలో యూనిఫామ్​ సివిల్​ కోడ్(Uniform Civil Code)​ అమలు చేయాల్సిన టైమ్​ వచ్చిందని అభిప్రాయపడింది. షరియా చట్టం కారణంగా ముస్లిం మహిళలు వివక్ష ఎదుర్కొంటున్నారంటూ దాఖలైన పిటిషన్​ను అత్యున్నత న్యాయస్థానం మంగళవారం విచారించింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ సూర్యకాంత్​, జస్టిస్​ జోయ్​మాల్యా బాగ్చీ, జస్టిస్​ ఆర్​.మహదేవన్​లతో కూడిన ధర్మాసనం అనేక కీలక వ్యాఖ్యలు చేసింది. షరియా చట్టం వల్ల ముస్లిం మహిళలు ఆస్తి విషయంలో వివక్ష ఎదుర్కొంటున్నారనే వాదనను అంగీకరిస్తూనే, ఈ చట్టాన్ని కొట్టివేయాలనే వాదనను తోసిపుచ్చింది. ముస్లిం పర్సనల్ లా వంటి చట్టాల వల్ల ఏర్పడుతున్న సంక్లిష్ట పరిస్థితుల నివారణకు యూసీసీ అమలుపై ప్రభుత్వం చట్టం తీసుకురావాలని సూచించింది(Supreme Court).

వాదనల సందర్భంగా జస్టిస్​ జోయ్​మాల్యా బాగ్చీ మాట్లాడుతూ షరియా చట్టం కొట్టేయాలన్న పిటిషనర్ల వాదనను తోసిపుచ్చారు. ‘ఈ చట్టాన్ని రద్దు చేసి ఖాళీ పరిస్థితి సృష్టించడం సరైనది కాదు. అందుకే ఈ అంశాన్ని ప్రభుత్వ నిర్ణయానికి వదిలేయడం మంచిది. యూసీసీ తీసుకురావడం ద్వారా ఇలాంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది’ అని అన్నారు. ముస్లిం సమాజంలో మగవాళ్లు ఏ విధానమైనా అనుసరించి, ఏకపక్షంగా విడాకులు ఇవ్వగలరని, ఇలాంటి చట్టాల ఆధారంగా ఏర్పడిన వివాహ సంబంధాలను చెల్లవని ప్రకటించడం సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు.

దీనిని సీజేఐ సూర్యకాంత్ కూడా సమర్థించారు. ‘మహిళలపై వివక్ష చూపే ఇలాంటి చట్టాలకు సరైన పరిష్కారం యూసీసీ(Uniform Civil Code) అమలే’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘దేశంలోని మహిళలలో ఒక వర్గం హక్కులు కోల్పోతే, వాటిని తిరిగి కల్పించడం మన లక్ష్యం కావాలి’ అని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. షరియా చట్టం కొట్టివేస్తే అందరికీ సమాన హక్కుల వర్తిస్తాయన్న పిటిషనర్​ తరఫు న్యాయవాదులతో సుప్రీం ఏకీభవించలేదు. తొందరపడి తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు ముస్లిం మహిళల హక్కులను తగ్గించే ప్రమాదం ఉందని భావించింది.

‘మనం సంస్కరణలపై అత్యుత్సాహంతో వ్యవహరిస్తే, ఇప్పుడున్న హక్కులకంటే తక్కువ హక్కులు వాళ్లకు దక్కే పరిస్థితి రావచ్చు’ అని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ సమస్యకు పరిష్కారం ప్రభుత్వ శాసనం రూపంలో తీసుకురావడం అవసరమని కోర్టు సూచించింది.

Read Also: రాహుల్ గాంధీకి కవిత సంచలన లేఖ

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>