కలం, కరీంనగర్ బ్యూరో: ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గంజాయి, హాష్ ఆయిల్, మత్తు టాబ్లెట్ల సంస్కృతి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు కేవలం మహానగరాలకే పరిమితమైన డ్రగ్స్ (Karimnagar Drug Menace) సంస్కృతి, ఇప్పుడు జిల్లా కేంద్రాల నుంచి పల్లెల వరకు విచ్చలవిడిగా విస్తరించింది. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులే లక్ష్యంగా గంజాయి ముఠాలు తమ నెట్‌వర్క్‌ను పటిష్టం చేసుకుంటున్నాయి. ఇటీవల నల్గొండ జిల్లాలో గంజాయి మత్తులో ఉన్న మైనర్లు ఒక ప్రిన్సిపాల్‌పై దాడి చేసి హత్యకు పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ సరిగ్గా అలాంటి భయాందోళనకర పరిస్థితులే నెలకున్నాయి.
పట్టుబడ్డవారిలో మైనర్లే ఎక్కువ..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పట్టుబడుతున్న గంజాయి కేసులను పరిశీలిస్తే ఒక దిగ్భ్రాంతికరమైన విషయం బయటపడుతోంది. 2025లో 234 కేసులలో 553 మందిని అరెస్ట్ చేసి 291 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 2026 జూలై నాటికి 139 కేసులు నమోదు చేసుకొని 257మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 157 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే, పట్టుబడిన వారిలో అధిక శాతం మంది మైనర్లు, చదువుకునే విద్యార్థులే కావడం గమనార్హం. దీనిని బట్టి దర్యాప్తు కేవలం ‘చివరి లింక్’ దగ్గరే ఆగిపోతోందా? అసలు ముఠా నాయకుల దాకా దర్యాప్తు ఎందుకు చేరడం లేదు? అనే ప్రశ్న లేవనెత్తుతోంది.
మైనర్లే ‘క్యారియర్లు’.. పెద్దల కుట్ర
మత్తు పదార్థాల వ్యాపారం నడిపే అసలు సూత్రధారులు పోలీసులకు దొరకకుండా ఉండేందుకు పక్కా వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా పాఠశాల, కళాశాలల విద్యార్థులను ‘క్యారియర్లు’గా మార్చుకుంటున్నారు. మైనర్లు పట్టుబడినా జువైనైల్ చట్టాల వల్ల తీవ్రమైన శిక్షలు ఉండవనే భావనను బడా వ్యాపారులు వాడుకుంటున్నారు. మొదట విద్యార్థులకు ఉచితంగా లేదా తక్కువ ధరకు గంజాయి ఇచ్చి అలవాటు చేస్తున్నారు. ఆ తర్వాత వారి వద్ద డబ్బులు వసూలు చేయడం, చివరికి ఆ డబ్బుల కోసం వారి చేతే ఇతరులకు సరఫరా చేయించడం వంటి దారుణాలకు ఒడిగడుతున్నారు. స్నేహితుల ఒత్తిడి, సోషల్ మీడియా ప్రభావం, కొత్త అనుభూతి కోసం ఆసక్తితో పాటు కుటుంబంలో తగినంత పర్యవేక్షణ లేకపోవడం పిల్లలను నేరాల వైపు మళ్లిస్తోంది.
రూ. 40 లక్షల హాష్ ఆయిల్.. విక్రయాల్లో కొత్త పోకడలు!
కేవలం గంజాయితోనే సరిపెట్టకుండా, మార్కెట్లోకి ప్రమాదకరమైన ప్రత్యామ్నాయాలు వస్తున్నాయి. ఒడిశా నుంచి రహస్యంగా తెలంగాణలోకి ప్రవేశిస్తున్న హాష్ ఆయిల్ లీటర్ ధర స్థానికంగా రూ. 30 నుండి 40 లక్షల వరకు పలుకుతోంది. స్మగ్లర్లు దీన్ని ‘చుక్కల’ చొప్పున అమ్ముతున్నారు. ఒక్క డ్రాప్ హాష్ ఆయిల్ ధర రూ. 4,000 నుండి 5,000 వరకు వసూలు చేస్తున్నారు. ఒక డ్రాప్‌ను వేడి నీటిలో వేసి ఆవిరి పీల్చడం ద్వారా ఐదుగురు రోజంతా మత్తులో ఊగిపోతున్నారు. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయించకూడని మత్తు బిళ్ళలను కొన్ని మెడికల్ షాపులు రెట్టింపు ధరలకు అమ్ముతున్నాయి.
నరాలను కట్ చేసుకొని..
యువత ఈ బిళ్ళలను లిక్విడ్‌గా మార్చి, చేతుల నరాలను కట్ చేసుకొని నేరుగా ఇంజెక్షన్లు తీసుకుంటుండటం తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఇటీవల కరీంనగర్ రూరల్ పోలీసులు కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి నేతృత్వంలో ఒక మెడికల్ షాపుపై దాడి చేసి నిర్వాహకుడిని అరెస్ట్ చేయడమే కాకుండా షాపును సీజ్ చేశారు. డ్రగ్స్ ,యాష్ ఆయిల్, గంజాయితో తొమ్మిది మందిని అరెస్టు చేసి జైలుకు పంపారు. వారిని వాంగ్మూలం ఆధారంగా మెడికల్ షాప్ ను సీజ్ చేయడంతో పాటు కీలక విషయాలు వెల్లడించడంతో కంగుతున్నపోలీసులు మూలాలు, బాధితుల నెట్ వర్క్ చేదించేందుకు ముమ్మర యత్నాలు చేస్తున్నారు.
దర్యాప్తులోని లోపాలు..’బ్యాక్‌వర్డ్ ట్రేసింగ్’ ఏది?
పోలీసులు విచారణ జరిపి కేసులు నమోదు చేస్తున్నప్పటికీ, ఇన్వెస్టిగేషన్ కేవలం చివరి లింక్ దగ్గరే ఆగిపోతోందనే విమర్శలు ఉన్నాయి. ఆర్థిక మూలాల శోధన లోపం స్పష్టంగా కనబడుతోంది. కిలోల కొద్దీ గంజాయి కొనుగోలుకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే దానిపై హవాలా, ఆన్‌లైన్ పేమెంట్ల ఆధారంగా విచారణ జరగడం లేదని తెలుస్తోంది. ఆధునిక సాంకేతికత వాడుతున్న యంత్రాంగం డిజిటల్ కవర్-అప్ లో విఫలమవుతోందా? అనే ప్రశ్న తలెత్తుతున్నాయి. పెద్ద వ్యాపారులు నేరుగా డబ్బులు తీసుకోకుండా QR కోడ్లు, ఆన్‌లైన్ పేమెంట్లు వాడుతున్నారు. గంజాయిని Drop Points దగ్గర ఉంచి కేవలం లొకేషన్ పిన్ మాత్రమే పంపుతూ తమ గుర్తింపు బయటపడకుండా జాగ్రత్త పడుతున్నారని తెలుస్తోంది.
దర్యాప్తులో రావాల్సిన కీలక మార్పులివే!
పోలీసులు, సంబంధిత అధికారులు ఎన్ని దాడులు నిర్వహిస్తున్నా, కేసులు నమోదు చేస్తున్నా ఈ మహమ్మారిని పూర్తిగా అరికట్టలేకపోతున్నారు. క్షేత్రస్థాయిలో గంజాయి తాగుతూ, విక్రయిస్తూ పట్టుబడే వారిపై కేసులు నమోదు చేసి చేతులు దులుపుకోవడం వల్ల అసలు నేరస్థులు యథేచ్ఛగా తిరుగుతున్నారు. గంజాయి మహమ్మారిని వేళ్లతో సహా పెకిలించాలంటే దర్యాప్తు విధానంలో మూలమట్టంగా మార్పులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సరఫరా వ్యవస్థపై నిఘా ఏది?
ప్రస్తుతం పట్టుబడుతున్న వారిలో అత్యధికంగా మైనర్లు, యువకులే ఉంటున్నారు. వీరిపై తాత్కాలిక కేసులు పెట్టి రిమాండ్‌కు పంపడంతోనే పోలీసులు సరిపెట్టుకుంటున్నారు. కానీ, ఆ మైనర్ల చేతికి గంజాయి ఎలా వచ్చింది? వారికి అందించిన ‘మూలాలు’ ఏంటి? అనే కోణంలో లోతైన విచారణ జరగడం లేదు. పట్టుబడిన వారి కాల్ డేటా రిపోర్ట్ ను నిశితంగా విశ్లేషించి, నెట్‌వర్క్ వెనుక ఉన్న అసలు సరఫరాదారులను పట్టుకోవాలి.
ఆర్థిక మూలాల ఊపిరి తీయాలి..
నేరస్థులపై కేవలం సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడమే కాకుండా, వారి ఆర్థిక మూలాలను దెబ్బతీయాలి. ప్రస్తుతం నగదు రూపంలో జరిగే చలామణిపై పెద్దగా శ్రద్ధ చూపడం లేదు. కానీ, ఈ వ్యాపారంలో హవాలా రూపంలో, ఆన్‌లైన్ డిజిటల్ వాలెట్ల ద్వారా కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. యూపీఐ (UPI) లావాదేవీలు, బ్యాంక్ ఖాతాలు, హవాలా మూలాలను వెంటాడి, ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న అసలు పెట్టుబడిదారులను, ఫైనాన్షియర్లను అరెస్ట్ చేసినప్పుడే ఈ నెట్‌వర్క్ ముక్కలవుతుంది.
హాట్‌స్పాట్ మ్యాపింగ్.. ఆధునిక నిఘా..
కేవలం సాధారణ వాహన తనిఖీలకు పరిమితం కాకుండా, గంజాయి విక్రయాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించాలి. విద్యాసంస్థలు, ప్రైవేట్ హాస్టళ్లు, నిర్మాణంలో ఉన్న భవనాలు, శివారు ప్రాంతాలను ప్రత్యేకంగా మ్యాపింగ్ చేయాలి. ఈ హాట్‌స్పాట్లలో డ్రోన్ కెమెరాలు, అత్యాధునిక సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిరంతర నిఘా ఏర్పాటు చేయాలి. గంజాయి రహిత సమాజం ఏర్పడాలంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ, సరఫరా గొలుసును తెంచివేసే దిశగా విచారణాధికారులు విప్లవాత్మక మార్పులతో ముందుకెళ్లాల్సి ఉంది.
పేరెంట్స్.. ఇలా చేయండి..
పిల్లల ప్రవర్తనలో ఆకస్మిక మార్పులు (చదువుపై శ్రద్ధ తగ్గడం, నిద్రలేమి, తరచూ ఎక్కువ డబ్బులు అడగడం, రాత్రివేళల్లో ఆలస్యంగా రావడం) గమనిస్తే తల్లితండ్రులు వెంటనే స్నేహపూర్వకంగా మాట్లాడి, నిపుణుల ద్వారా కౌన్సిలింగ్ ఇప్పించాలి. పోలీస్ యంత్రాంగం, విద్యాసంస్థలు, తల్లిదండ్రులు కలసికట్టుగా పోరాడినప్పుడే ఈ మత్తు రాక్షసి నుండి యౌవనాన్ని, విద్యార్థుల భవిష్యత్తును కాపాడుకోగలమని విశ్లేషకులు సూచిస్తున్నారు.

