కలం, యాదగిరిగుట్ట : ఆలేరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిరసన కార్యక్రమం చేపట్టారు. లోక్‌సభ కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకులు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఉత్తరాఖండ్‌లోని హల్ద్వాని పట్టణం కోట్వాలీ పోలీస్ స్టేషన్లో బీజేపీ నాయకులు అక్రమ కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ, ఏఐసీసీ ఇచ్చిన దేశవ్యాప్త పిలుపు మేరకు ఈ ఆందోళన నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య (Beerla Ilaiah) ఆధ్వర్యంలో ఆలేరు పట్టణంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీ నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య మాట్లాడుతూ ప్రజా సమస్యలపై, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రశ్నించే ప్రతిపక్ష నాయకుల గొంతును అణచివేయడానికి అక్రమ కేసులను ప్రయోగించడం సరైన పద్ధతి కాదన్నారు. రాహుల్ గాంధీ పై నమోదు చేసిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకులకు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు, ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉంటుందని తెలిపారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా కేసులు నమోదు చేసి కాంగ్రెస్ నాయకులను భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీ ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి బీజేపీ నాయకులు భయపడుతున్నారని, అందుకే ఇలాంటి అక్రమ కేసులతో కాంగ్రెస్ నాయకత్వాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.రాహుల్ గాంధీపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని, రాజకీయ కక్ష సాధింపు చర్యలకు స్వస్తి పలకాలని బీర్ల అయిలయ్య డిమాండ్ చేశారు. ఈ రాస్తారోకో కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

