కలం, ఖమ్మం బ్యూరో: తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఉమ్మడి ఖమ్మం–వరంగల్–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఓ ప్రత్యేకత ఉంది. విద్యావంతులు, ఉద్యోగులు, నిరుద్యోగ యువత మూడ్ను స్పష్టంగా ప్రతిబింబించే ఈ నియోజకవర్గాలు.. ఈసారి ఏడాది ముందే ఎమ్మెల్సీ (MLC Polls) మహా సంగ్రామానికి సిద్ధమవుతోంది. 2024 మే నెలలో జరిగిన ఉప ఎన్నికల కాక ఇంకా చల్లారకముందే, ప్రధాన పార్టీలన్నీ ఇప్పటినుంచే ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ప్రాంతీయ రాజకీయాల్లో సరికొత్త వేడిని పుట్టిస్తున్నాయి.
గాంధీ భవన్ వర్గాల్లో ఈ సీటు సాధించుకోవడం ఒక వైపు ప్రతిష్టాత్మక అంశంగా మారగా, మరోవైపు అంతర్గత పోటీ నాయకత్వానికి పెద్ద సవాలుగా మారింది. ఉప ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న సాధించిన విజయాన్ని మున్ముందు కూడా నిలబెట్టుకోవాలనే పట్టుదలతో అధికార కాంగ్రెస్ ఉంది. అందుకే పట్టభద్రులు, నిరుద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని తుడిచిపెట్టేందుకు వరుస ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తూ, వయోపరిమితి పెంపు లాంటి కీలక జీవోలతో వారిని విద్యార్థులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే, క్షేత్రస్థాయిలో అభ్యర్థి ఎవరనే దానిపై తీవ్ర పోటీ నెలకొంది.
కాంగ్రెస్ బరిలో ఆ నలుగురు
బీసీ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ మహేశ్ కొనాగార పేరును మంత్రి శ్రీధర్ బాబు సిఫారసు చేస్తుండగా, శాసనమండలి ఛైర్మన్ కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పేర్లు కూడా గట్టిగానే రేసులో ఉన్నాయి. వీరికి తోడు మహిళా, బీసీ కోటాలో బీసీ కమిషన్ మెంబర్ బాలలక్ష్మి కూడా సీటు కోసం గట్టిగానే శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పోటీని తట్టుకుని అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
బీఆర్ఎస్ నుంచే అతడే..
ఇక గులాబీ శిబిరం మాత్రం ఈ పోరును గట్టిగానే భావిస్తోంది. గత ఉప ఎన్నికల్లో దాదాపు 1,04,846 ఓట్లు సాధించి, ఆఖరి వరకు హోరాహోరీ పోరాటం చేసిన ఏనుగుల రాకేష్ రెడ్డినే మళ్లీ బరిలోకి దించాలని బీఆర్ఎస్ అధిష్ఠానం దాదాపు నిర్ణయించింది. ఓటమి ఎదురైనప్పటికీ ధైర్యం సడలకుండా రాకేష్ రెడ్డి నిరంతరం నిరుద్యోగుల సమస్యలు, జీవో-46 వివాదాలపై పోరాడుతూ నియోజకవర్గంలోనే పర్యటిస్తున్నారు. ఆయన చూపించిన నిలకడ గ్రామీణ ప్రాంత పట్టభద్రులలో బీఆర్ఎస్కు సానుకూలతను తెచ్చిపెట్టింది. వరంగల్లో ఉన్న 12 అసెంబ్లీ స్థానాల్లో 8 చోట్ల, ఖమ్మంలోని 10 స్థానాల్లో 6 చోట్ల క్షేత్రస్థాయి క్యాడర్ బలంగా ఉండటం, నల్గొండలో సమవుజ్జీ పోటీ నెలకొనడం బీఆర్ఎస్ ధైర్యాన్ని మరింత పెంచింది. ఈ పట్టభద్రుల పోరులోనే తమ మొదటి ఘన విజయాన్ని నమోదు చేసి తెలంగాణలో మళ్లీ పూర్వ వైభవాన్ని చాటాలని బీఆర్ఎస్ భావిస్తోంది.
బీజేపీ, జనసేన వ్యూహాలు
ఇదే సమయంలో జాతీయ, ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా రేసులో వెనకబడకూడదని పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాయి. గత ఎన్నికల్లో తీవ్రంగా నిరాశపరిచిన బీజేపీ, ఈసారి ఢిల్లీ స్థాయి వ్యూహాలతో బరిలోకి దిగుతోంది. జాతీయ నేతలు నేరుగా పర్యవేక్షిస్తున్న ఈ ఎన్నికలో, అనూహ్యంగా ఎంపీ ఈటల రాజేందర్ కోడలు క్షమితా రెడ్డి పేరును తెరపైకి తెచ్చి బీసీ, యువత ఓట్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు, తెలంగాణలో తమ బలాన్ని పెంచుకోవాలని భావిస్తున్న జనసేన పార్టీ ఏకంగా అందరికంటే ముందే తమ అభ్యర్థిని ప్రకటించి ఊహించని సంచలనం సృష్టించింది. కరోనా సమయంలో ప్రజాదరణ పొందిన మాజీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ గడల శ్రీనివాసరావును బరిలోకి దించి, ఉద్యోగ, వైద్య వర్గాల ఓట్లను తమ వైపు తిప్పుకోవడానికి పావులు కదుపుతోంది.
ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీ పదవీకాలం 2027 మార్చి 29తో ముగియనుండటంతో, ఫిబ్రవరి లేదా మార్చి నాటికి రాబోయే ఈ ఎన్నికల్లో రెండో ప్రాధాన్యత ఓట్లే మళ్లీ కీలకం కానున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ, ఉద్యోగ నిర్ణయాలు, మరోవైపు బీఆర్ఎస్ పోరాట పటిమ, ఇంకోవైపు బీజేపీ-జనసేనల బలమైన వ్యూహాల మధ్య ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఒక ఆసక్తికరమైన, హోరాహోరీ చతుర్ముఖ సమరానికి వేదిక కాబోతోంది.

