epaper
Sunday, January 18, 2026
spot_img
epaper

మోదీ ఫ్రెండ్ అంటూనే.. భారత్ ను టార్గెట్ చేస్తోన్న ట్రంప్

కలం డెస్క్: తన టార్గెట్లను ఛేదించేందుకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) టారిఫ్ లనే నమ్ముకున్నారు. వాటినే అస్త్రాలుగా మార్చుకొని ఇతర దేశాలపై ఆంక్షలు విధిస్తున్నారు. ఎప్పుడు ఏ దేశంపై ఎందుకు ఆయన ఎంతమేర టారిఫ్ వేస్తారో అర్థంకాని ట్రెండ్ గ్లోబల్ గా నెలకొంది. తనకు మోదీ (Narendra Modi) మంచి ఫ్రెండ్ అంటూనే భారత్ పైనా ట్రంప్ సుంకాలు విధించారు. తనకు అత్యంత దగ్గరగా ఉండే యూకేతో పాటు ఈయూ దేశాలనూ వదలలేదు. గ్రీన్ ల్యాండ్ (Greenland) విషయంలో తన జోలికి వస్తే ఎవరినీ విడిచిపెట్టబోననీ, టారిఫ్ లతో చావుదెబ్బతీస్తానంటూ హెచ్చరించారు. తాజాగా బ్రిటన్ , డెన్మార్క్, ఫ్రాన్స్ సహా పలు దేశాలపై 10 శాతం టారిఫ్ లను విధించారు. ఫిబ్రవరి నుంచి ఇవి అమలులోకి వస్తాయని.. గ్రీన్ ల్యాండ్ స్వాధీనం పూర్తికాకుంటే ఈ శాతాన్ని 25 శాతానికి పెంచుతామని వార్నింగ్ కూడా ఇచ్చారు. పైగా.. ‘మిస్టర్ టారిఫ్ ’ అంటూ తనను తాను ట్రంప్ పొగడ్తలతో ముంచెత్తుకుంటున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగేయిన్ (MAGA) అంటూనే.. పక్క దేశాలపై ట్రంప్ అక్కసు వెళ్లగక్కుతున్నారని గ్లోబల్ గా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రెండోసారి వచ్చీ రాగానే..!

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గతేడాది జవని 20న బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి టారిఫ్ లను (Tariffs) తనకు ఆయుధంగా మలుచుకున్నారు. మొదట మాజీ ప్రెసిడెంట్ బిడెన్ ను విమర్శిస్తూ.. పలు దేశాలపై విమర్శలు గుప్పించారు. ఆయన వల్లే అమెరికా పరిస్థితి ఆగమైందని.. దాన్ని సెట్ చేసేందుకు చర్యలు ప్రారంభించానని చెప్పారు. ప్రెసిడెంట్ సీట్లో కూర్చున్న మరుసటి రోజే (జనవరి 21న) చైనాపై 10 శాతం, మెక్సికో, కెనడాపై 25 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్స్ జారీ చేశారు. 2025 ఏప్రిల్ 2ను ‘లిబరేషన్ డే’గా ప్రకటిస్తూ.. అదే రోజూ దేశాల వారీగా టారిఫ్ ల లిస్టును ముందుకు తెచ్చారు. దాదాపు అన్ని దేశాల నుంచి వచ్చే వస్తువులపై 10 శాతం యూనివర్సిల్ టారిఫ్ విధించారు. 57 దేశాలపై అంతకంటే ఎక్కువ టారిఫ్ లు ప్రకటించారు. ఇదంతా అమెరికాను అగ్రస్థానంలో నిలిపేందుకేనని తెలిపారు.

భారత్ పై 50 శాతం

నరేంద్ర మోదీ తనకు అత్యంత సన్నిహితుడని పలు సందర్భాల్లో ప్రస్తావించిన ట్రంప్.. ఇండియాపై ఏకంగా 50 శాతం టారిఫ్ లు విధించారు. మొదట నిరుడు జులై 30న 25% వేశారు. ఇది ఆగస్టు 1 నుంచి అమలులోకి వచ్చింది. ఆ తర్వాత అడిషనల్ టారిఫ్ అంటూ ఆగస్టు 6న మరో 25 శాతం విధించారు. ఇది ఆగస్టు చివరి నుంచి అమలులోకి వచ్చింది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని చూపి.. ఇలా భారత్ పై తన టారిఫ్ ల బాంబ్ ను అమెరికా ప్రెసిడెంట్ పేల్చారు. పైగా ఇండియా, పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని పలు మార్లు చెప్పుకొచ్చారు. తమతో చర్చలకు వస్తే.. టారిఫ్ ల తగ్గింపుపై ఆలోచిస్తామన్నారు. ఇప్పటికీ ఆ చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా 500 శాతం టారిఫ్ లు విధించేందుకు కూడా వెనుకడుగు వేయబోనంటూ ఆయన మరో బాంబ్ పేల్చారు. రష్యా నుంచి ఆయిల్ కొంటే ఈ మొత్తం విధిస్తామనీ.. దీని కోసం బిల్లు కూడా తెస్తున్నట్లు చెప్పారు.

‘పీస్ ప్రెసిడెంట్’ అంటూనే..!

తనకు తాను ‘పీస్ ప్రెసిడెంట్ ’ను అని ప్రకటించుకున్న ట్రంప్.. సుంకాలతో ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. రష్యా – ఉక్రెయిన్ వార్ పేరు చెప్పి ఓసారి.. ఇరాన్ – ఇజ్రాయిల్ వార్ పేరు చెప్పి ఇంకోసారి… పాలస్తీనా – ఇజ్రాయిల్ యుద్ధం పేరు చెప్పి మరోసారి ఇట్ల టారిఫ్ బాంబ్ ను పేలుస్తూ ఉన్నారు. ఇటీవల వెనిజువెలా విషయంలో తమ జోలికి వస్తే ఊరుకోబోమంటూ సుంకాల బూచీని చూపారు. ఇప్పుడు ఇరాన్, గ్రీన్ ల్యాండ్ అంశాన్ని తెరపైకి తెచ్చి ఇదే పాట అందుకున్నారు. శాంతిభద్రతల్లో భాగంగా గ్రీన్ ల్యాండ్ ఎప్పటికైనా అమెరికాలో కలిసిపోవాల్సిందేనని.. దీన్ని ఎవరు వ్యతిరేకించినా ఊరుకోనని హెచ్చరించారు. డెన్మార్క్ లో అంతర్భాగంగా స్వయంప్రతిపత్తితో ఉన్న గ్రీన్ ల్యాండ్ పై ట్రంప్ చర్యలను పలు దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా బ్రిటన్ (యూకే), డెన్మార్క్, ఫ్రాన్స్ వంటి దేశాలు ఈ లిస్టులో ఉన్నాయి. వీటితోపాటు పలు యురోపియన్ యూనియన్ దేశాలపైనా తాజాగా 10 శాతం టారిఫ్ లను ట్రంప్ (Donald Trump) విధించారు. మరో 25 శాతం విధిస్తానని హెచ్చరించారు.

యూఎస్ స్టాక్ మార్కెట్లు అప్.. ఇతర మార్కెట్లు ఆగం

ట్రంప్ టారిఫ్ (Trump Tariffs) ల వల్ల అమెరికా స్టాక్ మార్కెట్ (Stock Market) రాకెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాయి. కీలకమైన డౌజోన్స్ ఇండెక్స్ ఆరు నెలల్లో 12 శాతం పెరిగింది. నాస్ డాక్ ఇండెక్స్ సైతం 12 శాతం పెరిగి.. యూస్ ఇన్వెస్టర్లకు లాభాల పంట పండిస్తున్నాయి. అయితే.. ఇతర దేశాల స్టాక్ మార్కెట్లు మాత్రం ఆగమైతున్నాయి. ఒక్కోసారి ఆల్ టైమ్ కు వెళ్లి.. అంతలోనే ఆల్ టైమ్ లోకి కూడా పడిపోతున్నాయి. ఈ పరిణామాలతో ఇతర దేశాల ఇన్వెస్టర్లు తలలుపట్టుకుంటున్నారు. భారత స్టాక్ మార్కెట్ దీ ఇదే పరిస్థితి. ఆగస్టులో నిఫ్టీ 50 (Nifty 50) ఇండెక్స్ 24,500 దగ్గర ట్రేడ్ కాగా.. ఆ తర్వాత అక్టోబర్ లో 26 వేల మార్క్ కు చేరుకుంది. మళ్లీ కొన్నిరోజులకే కుప్పకూలింది. ఇప్పుడూ డౌన్ ట్రెండ్ లోనే ఉంది. యూకేపై టారిఫ్ వేస్తానన్న ట్రంప్ తాజా ప్రకటనతో భారత ఇన్వెస్టర్లు మరింత భయపడ్తున్నారు. కొన్ని దేశాల స్టాక్ మార్కెట్లలో అయితే ఏడాది నుంచి పెద్దగా మూమెంటమే లేదు. అమెరికా ఇన్వెస్టర్లకు పంట పండించేందుకు, ఇతర దేశాల మార్కెట్లను దెబ్బతీసేందుకే గ్లోబల్ గా ట్రంప్ టారిఫ్ ల అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారని ఇన్వెస్టర్లు అంటున్నారు.

ట్రంప్ (Donald Trump) విధించిన టారిఫ్ లు పలు దేశాల వారీగా..

దేశం టారిఫ్
ఇండియా 50 %
చైనా 34 % (కొన్ని వస్తువులపై 60%)
మెక్సికో 25 %
కెనడా 25 %
వియత్నాం 46 %
ఈయూ దేశాలు 20 % (గ్రీన్ ల్యాండ్ ఇష్యూలో 8 ఈయూ దేశాలపై 10 % అదనం)
పాకిస్తాన్ 29 %
తైవాన్ 32 %
ఇజ్రాయెల్ 15 %
రష్యా 100 %
బ్రెజిల్ 40%

Read Also: ప్రజలు పదేపదే తిరస్కరిస్తున్నా మారని కాంగ్రెస్ : ప్రధాని మోదీ

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>