కలం వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయని టీడీపీ(TDP) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న(Buddha Venkanna) స్పష్టం చేశారు. ఇటీవల పిన్నెల్లిలో వైఎస్సార్సీపీ (YSRCP) కార్యకర్త హత్యతో రాష్ట్రంలో శాంతి భద్రతలపై వైసీపీ నేతలు తీవ్ర ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుద్ధా వెంకన్న ఆదివారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయని, వైఎస్ జగన్ హయాంలోనే అరాచకాలు జరిగాయని ఆరోపించారు. పిన్నెల్లిలో పాత కక్షలతోనే సాల్మన్ హత్య జరిగినట్లు వెంకన్న తెలిపారు. ఆ హత్యను టీడీపీకి పులిమి రాజకీయంగా నష్టం చేకూర్చాలని జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో జగన్ కుల రాజకీయాలు మొదలు పెట్టేందుకు ప్రజల్ని రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా రాష్ట్రంలో ఇకపై వైసీపీ అధికారంలోకి వచ్చేది లేదని, జగన్ సీఎం అయ్యేది లేదని వెంకన్న వ్యాఖ్యానించారు.


