కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (Kothagudem DMHO) డాక్టర్ తుకారాం రాథోడ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ కాన్పుల శాతాన్ని పెంచేందుకు వైద్య సిబ్బంది శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, ఔషధాల నిల్వలు, గర్భిణీల రిజిస్టర్లు, టీకాల అమలు తీరును పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. గర్భిణీలకు ఈడీడీ క్యాలెండర్ ప్రకారం ప్రసవ తేదీలను గుర్తించి నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.
గర్భిణుల వైద్య పరీక్షలు తప్పనిసరి
ప్రతి గర్భిణికి కనీసం నాలుగు సార్లు వైద్య పరీక్షలు నిర్వహించి రక్తపోటు, షుగర్, హీమోగ్లోబిన్ పరీక్షలు తప్పనిసరిగా చేయాలని తెలిపారు. మాతా, శిశు మరణాలను తగ్గించేందుకు హైరిస్క్ గర్భిణీలను ముందుగానే గుర్తించి అవసరమైన చికిత్స అందించాలని పేర్కొన్నారు.
మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లొద్దు
ప్రస్తుతం ఎండలు ఉన్నందున వడదెబ్బ తగలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని డీఎంహెచ్‌ఓ (Kothagudem DMHO) సూచించారు. ప్రజలు తగినంత నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు, ఓఆర్ఎస్ ద్రావణాలు తీసుకోవాలని, చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలన్నారు. దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా వ్యాధుల నివారణకు ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, వారానికి ఒకరోజు డ్రై డే పాటించేలా ప్రజలకు వివరించాలన్నారు. జ్వరం వచ్చిన వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని తెలిపారు.
పల్స్ పోలియో విజయవంతం చేయండి
రాబోయే పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం కావడానికి మైక్రో ప్రణాళికను సిద్ధం చేసి, ఒక్క చిన్నారిని కూడా మిస్ కాకుండా సున్నా నుండి ఐదేళ్ల లోపు పిల్లల కోసం ఇంటింటి సర్వే నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలు పరిశుభ్రత పాటించడం, మరుగుదొడ్లు వినియోగించడం, చేతులు సబ్బుతో కడుక్కోవడం వంటి అలవాట్లు అలవరుచుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్ఎల్ హెచ్ పీ వెంకటేష్, హెచ్‌వి రాధిక, నర్సింగ్ ఆఫీసర్, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
Read Also: తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌పై మహారాష్ట్ర సీఎంకు రేవంత్ లేఖ
Follow Us On : WhatsApp

