కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని శ్రీ గండి రామన్న సాయిబాబా ఆలయంలో (Gandi Ramanna temple) కొలువుదీరిన సాయినాథుడికి షిరిడీలోని మూలవిరాట్ తరహాలో ప్రత్యేక ఆభరణాన్ని అలంకరించాలనే సంకల్పంతో భక్తులు ప్రత్యేక హారాన్ని సమర్పించారు. ఆర్నమెంట్లతో రూపొందించిన ఈ దివ్య హారాన్ని గురువారం భక్తిశ్రద్ధలతో ఆలయ నిర్వాహకులకు అందజేశారు. సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షుడు లక్కిడి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు సాయి భక్తులు, సేవకులు కలిసి రూ.46 వేల వ్యయంతో ఈ ప్రత్యేక హారాన్ని షిరిడీ నుంచి స్వయంగా తెప్పించారు. అనంతరం ఇన్చార్జి ఈవో భూమయ్య, ఆలయ చైర్మన్ కొట్టే శేఖర్‌కు భక్తులు హారాన్ని సమర్పించారు.
ప్రతిరోజూ నిత్య అలంకరణలో భాగంగా ఈ ప్రత్యేక హారాన్ని సాయిబాబాకు ధరింపజేయాలని ఈ సందర్భంగా ఆలయ కమిటీని భక్తులు కోరారు. షిరిడీ సాయినాథుడి తరహాలో నిర్మల్ సాయిబాబాను అలంకరించాలనే తమ ఆకాంక్ష నెరవేరడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, సాయి భక్తులు, సేవకులు తదితరులు పాల్గొన్నారు.

