కలం, దేవరకొండ : ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటూ వాటి తక్షణ పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని దేవరకొండ ఎమ్మెల్యే (Devarakonda MLA) నేనావత్ బాలు నాయక్ (Nenavath Balu Naik) తెలిపారు. శుక్రవారం ఉదయం దేవరకొండ పట్టణంలోని 7వ వార్డులో నిర్వహించిన మార్నింగ్ వాక్ విత్ పీపుల్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ పర్యటనలో భాగంగా కాలనీలో రూ.70 లక్షలు, రూ.50 లక్షలు, రూ.35 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
నిర్మాణ నాణ్యతా ప్రమాణాలు, ప్రజలకు అందుతున్న సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాలనీలోని పలు కుటుంబాలను స్వయంగా కలసి వారి సమస్యలను ఎమ్మెల్యే నేరుగా అడిగి తెలుసుకున్నారు. స్థానికులు తెలిపిన సమస్యలపై తక్షణమే స్పందించి, సంబంధిత అధికారులతో మాట్లాడి వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు.
అంతేకాకుండా, కాలనీకి ఇంకా అవసరమైన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, మెరుగైన తాగునీటి వసతులు, మిగిలిన వీధుల్లో సీసీ రోడ్ల నిర్మాణం తదితర అంశాలను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ.. “ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో పట్టణాల అభివృద్ధి, సంక్షేమానికి మా ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ప్రజల వద్దకే వెళ్ళి సమస్యలు తెలుసుకుని, అక్కడికక్కడే పరిష్కరించడమే ఈ మార్నింగ్ వాక్ ముఖ్య ఉద్దేశం అని అన్నారు.
దేవరకొండలో ఇప్పటికే కోట్లాది రూపాయలతో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ ప్రతి వార్డును మోడల్‌గా తీర్చిదిద్దుతాం.” అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ పున్న శైలజ వెంకటేష్, స్థానిక కౌన్సిలర్ హనుమంతు సాయి చంద్ర గౌడ్, మాజీ చైర్పర్సన్ ఆలంపల్లి నరసింహ, ఎంఏ సిరాజ్ ఖాన్, హనుమంతు వెంకటేష్ గౌడ్, మారుపాకుల సురేష్ గౌడ్, కిన్నెర హరికృష్ణ, వివిధ వార్డుల కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాలనీ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

