కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మహిళా శక్తి వారోత్సవాల్లో భాగంగా సోమవారం దేవరకద్ర ఎమ్మెల్యే (Devarakadra MLA) మధుసూదన్ రెడ్డి (Madhusudhan Reddy) కొత్తకోట (Kothakota) బస్టాండ్‌లో దేవరకద్ర నియోజకవర్గానికి చెందిన మహిళా సంఘాల రెండు ఆర్టీసీ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం అదే బస్సులో మహిళా సంఘాల సభ్యులతో కలిసి మిరాస్ పల్లి వరకు ప్రయాణించి మిరాస్ పల్లి జాతీయ రహదారిపై మహిళా సంఘాలకు ప్రభుత్వ సబ్సిడీ పై రూ.2 కోట్ల అంచనా వ్యయంతో మంజూరు చేసిన భారత్ పెట్రోలియం బంక్ కు భూమి పూజ చేశారు.
అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. ఒకప్పుడు మహిళలు కేవలం పొదుపు చర్యలకు మాత్రమే పరిమితం అయ్యేవారని కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి అనేక సంక్షేమ పథకాలను మహిళా సంఘాల సభ్యులకు అందజేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే సబ్సిడీ పై ఆర్టీసీ బస్సులు ఇప్పించడం, పెట్రోల్ బంక్ లు కేటాయించడం, క్యాంటీన్లు ఏర్పాటు చేయడం వంటి వ్యాపారాభివృద్ధి పనులు ఇస్తున్నారని అన్నారు. నారాయణపేట జిల్లాలో మహిళా సంఘాల సభ్యులకు మంజూరు చేసిన పెట్రోల్ బంక్ ద్వారా మహిళలు అన్ని ఖర్చులు పోను ఏడాదికి రూ.13 లక్షల లాభాలు ఆర్జించారని తెలియజేశారు. ఆర్టీసీ బస్సులకు యజమానులు చేయడం ద్వారా ఆర్టీసీ యాజమాన్యానికి అద్దెకు బస్సులు ఇచ్చి ప్రతి నెల రూ.70 వేలు అద్దె వసూలు చేస్తున్నట్లు తెలిపారు.
‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక అనేది భారత దేశంలోనే మొదటిదని, ఇందులో భాగంగా చివరిదైన మహిళా శక్తి వారోత్సవాలు మే 25 నుండి ప్రారంభమైనట్లు తెలిపారు. అందులో భాగంగానే సోమవారం మహిళా సంఘాలకు సంబంధించిన పెట్రోల్ బంక్ భూమి పూజ, బస్సు ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. జాతీయ రహదారిపై ఎంతో విలువైన ఒక ఎకరం భూమిని తన నియోజకవర్గంలోని మహిళా సంఘాలకు కేటాయించినందుకు జిల్లా కలెక్టర్ కు ధన్యవాదాలు తెలిపారు. వచ్చే 90 రోజుల్లో పెట్రోల్ బంక్ పనులు పూర్తి చేసుకొని ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
అనంతరం వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. జిల్లాలోని మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు జిల్లా యంత్రాంగం చేయూతను అందిస్తుందని తెలిపారు. అందులో భాగంగా భారత్ పెట్రోలియం సంస్థతో ఒప్పందం చేసుకొని రూ.3 కోట్ల విలువైన ఎకరం స్థలాన్ని మహిళా సంఘాలకు పెట్రోల్ బంక్ ఏర్పాటుకు కేటాయించినట్లు తెలిపారు. రూ. 2 కోట్ల అంచనా వ్యయంతో భారత్ పెట్రోలియం సంస్థ పెట్రోల్ బంక్ ఏర్పాటు చేస్తుందన్నారు. మహిళా సంఘాల పెట్రోల్ బంక్ జాతీయ రహదారి పై ఉండటం ఇదే మొదటిదని, బంక్ ప్రారంభించాక మహిళలు మంచి లాభాలను ఆర్జించవచ్చని అన్నారు.

