Mobile Popup Ad
Mobile Popup Ad

పంట అవశేషాలు కాల్చితే చర్యలు తప్పవు: భట్టి విక్రమార్క

కలం, ఖమ్మం బ్యూరో: రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ, వాయు కాలుష్య నియంత్రణలో భాగంగా పంట అవశేషాలను (వరి కొయ్యలను) పొలాల్లో కాల్చవద్దని, దీనిపై గ్రామాల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అధికారులను ఆదేశించారు. ఒకవేళ అవగాహన కల్పించిన తర్వాత కూడా ఎవరైనా పంట అవశేషాలను కాల్చేందుకు ప్రయత్నిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం ​మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి (Minister Uttam) ఆధ్వర్యంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావులతో కలిసి ధాన్యం కొనుగోళ్లపై ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో ఖమ్మం కలెక్టరేట్ నుండి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, సీపీ సునీల్ దత్‌లతో కలిసి పాల్గొన్నారు.

​ఈ సందర్భంగా భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) మాట్లాడుతూ.. అనేక సవాళ్లు, భారీ దిగుబడి వచ్చినప్పటికీ యాసంగి ధాన్యం కొనుగోళ్లను సమర్థవంతంగా నిర్వహిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అభినందనలు తెలిపారు. గతంలో ధాన్యం డబ్బుల కోసం రైతులు నెలలు తరబడి వేచి చూడాల్సి వచ్చేదని, కానీ ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో సొమ్ము జమ అవుతోందని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు 1,23,560 మెట్రిక్ టన్నుల ధాన్యానికి గానూ.. 1,12,922 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తి చేశామని, మిగిలిన ధాన్యాన్ని కూడా త్వరలోనే కొనుగోలు చేస్తామన్నారు. అలాగే పట్టణాభివృద్ధిలో వాయు కాలుష్య నియంత్రణ ఎంతో ముఖ్యమన్నారు. పంట అవశేషాలను కాల్చడం వల్ల కాలుష్యంతో పాటు పక్క పొలాలకు మంటలు వ్యాపించి ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. కాబట్టి ప్రతి గ్రామంలో రాబోయే 15 నుండి 30 రోజుల పాటు టామ్‌టామ్ (దండోరా) ద్వారా దీనిపై విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులకు సూచించారు.

పౌరసరఫరాల శాఖ ​మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మే చివరి నాటికి రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ వంద శాతం పూర్తి కావాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. స్థానిక హమాలీలు, రవాణా సమస్యలను మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పరిష్కరించుకోవాలన్నారు. గత బకాయిలు (రైస్ డెలివరీ) వంద శాతం పూర్తి చేసిన డిఫాల్ట్ రైస్ మిల్లర్ల నుండి అండర్‌ టేకింగ్ తీసుకుని మాత్రమే కొత్త ధాన్యం కేటాయించాలని స్పష్టం చేశారు.

​రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Minister Tummala) మాట్లాడుతూ.. ఇటీవల మంత్రివర్గం సన్‌ఫ్లవర్ (పొద్దుతిరుగుడు) పంట కొనుగోలుకు ఆమోదం తెలిపిందని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో చివరి గింజ వరకు పంట కొనుగోళ్లు జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. ​ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ఖమ్మం అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డితో పాటు సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Read Also:  అమెరికా ఫస్ట్ వర్సెస్ ఇండియా ఫస్ట్: జైశంకర్ హాట్ కామెంట్స్

Reda Also: గుర్తింపు దక్కని అమరులెందరో..!

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>