విద్య, వైద్య రంగాల్లో భారీ పెట్టుబడులతో మెరుగైన సేవలు: డిప్యూటీ సీఎం భట్టి

కలం, ఖమ్మం బ్యూరో: విద్య, వైద్య రంగాల్లో భారీ పెట్టుబడులతో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka) తెలిపారు. బుధవారం డిప్యూటీ సీఎం భ‌ట్టి, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంన్‌లతో కలిసి సత్తుపల్లిలో రూ.34 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన వైద్య విధాన పరిషత్ 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. సత్తుపల్లి పట్టణంలో వంద పడకల ఆసుపత్రిని ప్రారంభించడంతో పాటు స‌త్తుప‌ల్లి నియోజకవర్గంలో ఒక 50 పడకల ఆసుపత్రి, మరో 30 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవం చేసిన‌ట్లు తెలిపారు. అలాగే విద్యుత్ శాఖకు సంబంధించి పలు విద్యుత్ ఉప కేంద్రాల నిర్మాణ పనులకు శంకుస్థాపన, ఎకో టూరిజం ప్రాంతాన్ని పరిశీలించిన‌ట్లు తెలిపారు.

ఈ ఆస్పత్రుల నిర్మాణం ప్రజల పట్ల ప్రజా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం అని డిప్యూటీ సీఎం తెలిపారు. విద్య, వైద్య రంగాలపై అధికంగా పెట్టుబడులు పెడుతూ ప్రజలకు మెరుగైన వసతులు కల్పిస్తున్నామన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు 14 వేల అదనపు పడకలు అందుబాటులోకి తీసుకొని వచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కార్పొరేట్ స్థాయిలో పేద ప్రజలు కూడా విద్య అందుకోవాలనే లక్ష్యంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామన్నారు. డిజిటల్ విద్యా, క్రీడలు, కల్చరల్ యాక్టివిటీస్ అందుబాటులో ఉండేలా ఆ స్కూల్స్ రూపుదిద్దుకుంటున్న‌ట్లు తెలిపారు. అలాగే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కూడా త్వరలో అందుబాటులోకి వస్తాయని వెల్ల‌డించారు.

ప్రస్తుతం ఉన్న రెసిడెన్షియల్ స్కూల్స్‌లో పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించేందుకు 40 శాతం డైట్ చార్జెస్, 200 శాతం కాస్మొటిక్ చార్జీలు పెంచడం జరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 20 లక్షలకు పైగా విద్యార్థుల కోసం రాబోయే జూన్ 2 నుంచి అల్పాహార పథకం ప్రారంభిస్తామని తెలిపారు. నైపుణ్య విద్యను ప్రోత్సహించడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లను మంజూరు చేసి యువతకు ఉపాధి లభించేలా అవసరమైన నైపుణ్యాలు కల్పిస్తామ‌ని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్‌ల‌ను దానికి అనుబంధం చేస్తున్నామన్నారు. అలాగే ఏటీసీ సెంటర్లలో వివిధ కోర్సులు చేసే విద్యార్థులకు ప్రతి నెల రూ.2 వేల స్కాలర్షిప్ అందిస్తామ‌న్నారు.

రాష్ట్ర‌ విద్యార్థులకు ఇక్కడే కాకుండా విదేశాల్లో కూడా ఉపాధి అవకాశాలు లభించే విధంగా టామ్ కామ్ వ్యవస్థ ఏర్పాటు చేసిన‌ట్లు భ‌ట్టి తెలిపారు. రాష్ట్రంలో ప్ర‌జ‌ల‌కు ఆహార కొరత లేకుండా కోటి ఆరు లక్షల కుటుంబాలకు సన్న బియ్యం ప్రతినెలా సరఫరా చేస్తున్నామన్నారు. ఖమ్మం జిల్లా వ్యవసాయ ఆధారితమైన జిల్లా అని, ఇక్కడ రైతుల కోసం గత కాంగ్రెస్ హయాంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మించి ఆయకట్టు తీసుకొని వచ్చామని తెలిపారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున నీటి వసతి కల్పించడం కోసం అనేక ప్రాజెక్టులు చేపట్టిందని, ప్రస్తుతం జిల్లాలో 3,40,000 ఎకరాలకు ఆయకట్టు ఉంటే, అదనంగా మరో 3 లక్షల 16 వేల ఎకరాలకు పైగా ఆయకట్టు నీరు అందించేందుకు రూ.2,500 కోట్లు విడుదల చేశామన్నారు. రాష్ట్రంలో అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. పేదలు ఇండ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం నేరుగా రూ.5 లక్షలు విడుదల చేస్తుందని, దేశంలో ఎక్కడ ఇటువంటి పథకం అమలులో లేదని తెలిపారు. పులి గుండాల చెరువు , కనికగిరి హిల్స్ ప్రపంచ టూరిజం స్థాయిలో అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.‌

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>