జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులకు ‘ప్రతిభ పురస్కారాల’ ప్రదానం

కలం, వనపర్తి: ఆస్తుల కంటే విజ్ఞానమే గొప్పదని, విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య అన్నారు. వనపర్తి (Wanaparthy) పట్టణంలోని హరిజనవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన నగదు ప్రతిభ ప్రోత్సాహక పురస్కార మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డాక్టర్లు, ఇంజినీర్లు, ఉపాధ్యాయులు, న్యాయవాదులుగా ఎదిగి సమాజానికి ఆదర్శంగా నిలవాలని విద్యార్థులకు సూచించారు. పాఠశాలలో ఉన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 2026 ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో 566 మార్కులు సాధించి మహబూబ్‌నగర్ ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన నజీరా, అలాగే కరీంనగర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న కృతికకు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులను కూడా సత్కరించారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు సూర చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కృతిక ఉన్నత విద్యకు తన బాల్యమిత్రుడు ఆత్మకూరు బాలవర్ధన్ రెడ్డి గత ఏడాది రూ.20 వేల ఆర్థిక సహాయం అందించగా, ఈ ఏడాది మరో రూ.50 వేల సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పట్టుదలతో కృషి చేస్తే లక్ష్యాలను సాధించవచ్చని కృతిక విద్యార్థులకు సూచించింది. తనకు సహకరించిన బాలవర్ధన్ రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపింది.

నజీరా మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు, తల్లి అందించిన ప్రోత్సాహమే తన విజయానికి కారణమని పేర్కొంది. ఈ సందర్భంగా 18వ వార్డు కౌన్సిలర్ గంధం మదన్ గతంలో ఇచ్చిన హామీ మేరకు రూ.10 వేల నగదు బహుమతి అందజేశారు. అలాగే సీనియర్ ఉపాధ్యాయుడు వాకిట రవికుమార్ తన తండ్రి వాకిట కృష్ణయ్య జ్ఞాపకార్థం రూ.10 వేలు, అరవింద్ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం రూ.10 వేలు అందజేశారు. 500కు పైగా మార్కులు సాధించిన అబ్దుల్ ఆదిల్, భార్గవి, భానుప్రకాశ్, జయచంద్ర, జ్ఞానేశ్వరి విద్యార్థులకు ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్ తరఫున రూ.1,000, ఆత్మకూరు బాలవర్ధన్ రెడ్డి తరఫున మరో రూ.1,000 చొప్పున మొత్తం రూ.2 వేల ప్రోత్సాహక నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏసీజీ అండ్ జీహెచ్‌ఎం గణేష్ కుమార్, సామాజిక కార్యకర్తలు గంధం నాగరాజు, భోజరాజు వెంకటేష్, విశ్వంబాబు, శంకర్ గౌడ్, బైరవ చంద్రశేఖర్, శ్రీనివాసులు, మహిపాల్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>