రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా డీలిమిటేషన్.. ఖర్గే నివాసంలో విపక్షాల భేటీ

కలం, నేషనల్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం చాలా నష్టదాయకమైన విధానాలకు శ్రీకారం చుడుతున్నదని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. భారత రాజ్యాంగం సహకార సమాఖ్య స్ఫూర్తిని ఇనుమడింపజేసేలా హామీ ఇస్తే మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మాత్రం దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీల నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో బుధవారం మధ్యాహ్నం మొదలైన ఇండియా కూటమి పార్టీల సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న పలు బిల్లులపై చర్చ ప్రారంభమైంది.చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే చట్ట సవరణ బిల్లుతో పాటు నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణకు ఉద్దేశించిన డీమిలిటేషన్ (Delimitation) బిల్లును కూడా గురువారం పార్లమెంటు ఉభయ సభల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. ఈ బిల్లుల్లోని లొసుగులను, ఉల్లంఘనలపై కాంగ్రెస్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది.

ఈ బిల్లులు లోపభూయిష్టంగా ఉన్నాయని, డీలిమిటేషన్ కోసం ప్రభుత్వం అందులో పేర్కొన్న అంశాలు సహకార సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ‘రాష్ట్రాల సమాహారమే దేశం’ అనే రాజ్యాంగ నిబంధనకు పాతర వేసే విధంగా ఈ బిల్లులను కేంద్ర ప్రభుత్వం రూపొందించినట్లు ఆరోపించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ సీనియర్ నేతలతో సహా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శివసేన, డీఎంకే, రాష్ట్రీయ జనతాదళ్, రివొల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, సీపీఐ, సీపీఎం, ఫార్వర్డ్ బ్లాక్ తదితర పార్టీల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈ బిల్లులపై పార్లమెంటు ఉభయ సభల్లో రేపటి నుంచి మూడు రోజుల పాటు వరుసగా చర్చలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగ వ్యతిరేక విధానాలను చట్టసభల వేదికగానే ప్రశ్నించాలని ఈ పార్టీలు నిర్ణయించాయి. ఈ బిల్లులు సభల్లో ఆమోదం పొందితే అనేక రాష్ట్రాలకు శాశ్వతంగా నష్టం, అన్యాయం జరగనున్నదని సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. పార్లమెంటు సభల్లో అనుసరించిన వ్యూహంపై ఈ సమావేశంలో నిర్ణయం జరగనున్నది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>