కలం, నేషనల్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో పెట్రోల్ బైక్‌ల రిజిస్ట్రేషన్ బంద్ కానున్నది. కేవలం ఎలక్ట్రిక్ బైక్‌ల రిజిస్ట్రేషన్స్ జరగనున్నాయి. ఈ మేరకు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఈవీ పాలసీ (New EV Policy)ని తీసుకొచ్చింది. ప్రస్తుతం రోడ్లపై తిరుగుతున్న పెట్రోల్ బైక్‌లను ఎలక్ట్రిక్ బైక్‌లుగా మార్చుకోవడం లేదా వాటిని స్క్రాప్ కింద అమ్మేయడం చేయాల్సి ఉంటుందని ఆ పాలసీ నొక్కిచెప్పింది. ఇప్పటికే పెట్రోలు, డీజిల్‌తో నడుస్తున్న బైక్‌లు, కార్లను ఈవీలోకి మార్చుకునేందుకు సిద్ధపడితే వాటిపై ప్రోత్సాహకాలను ఢిల్లీ రాష్ట్ర సర్కార్ ఇవ్వనున్నది. స్క్రాప్ కింద విక్రయించినా ఒక్కో బైక్‌కు రూ. 10 వేలు, త్రీ-వీలర్స్ కు రూ. 25 వేలు, ఫోర్ వీలర్స్ కు రూ. 50 వేల చొప్పున స్క్రాపేజీ ఇన్సెంటివ్ లభిస్తుంది. కొత్తగా కొనే ఎలక్ట్రిక్ టూ-వీలర్స్ విషయంలో ఈ పాలసీ స్పష్టత ఇచ్చింది. గరిష్టంగా బైక్ మార్కెట్ ధర రూ. 2.25 లక్షలు ఉన్నట్లయితే ఫస్ట్ ఇయర్ రూ. 30 వేల మేర సబ్సిడీ, రెండో సంవత్సరం రూ. 20 వేలు, ఆ తర్వాత రూ. 10 వేల చొప్పున ఇన్సెంటివ్ లభిస్తుంది. 2030 సంవత్సరం తర్వాత ఎలక్ట్రిక్ బైక్‌లపై ఎలాంటి సబ్సిడీ, ప్రోత్సాహకాలు ఉండవు.
వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఈ-ఆటో రిక్షాలు మాత్రమే :
కొత్తగా రోడ్లమీదకు వచ్చే ఆటోరిక్షాల విషయంలోనూ వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి కేవలం ఎలక్ట్రిక్ అయితే మాత్రమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఏప్రిల్ 2027 నుంచి అమల్లోకి వస్తున్నందున తొలి సంవత్సరం ప్రతీ ఎలక్ట్రిక్ ఆటో మీద ప్రభుత్వం నుంచి రూ. 50 వేల మేర సబ్సిడీ, ఆ తర్వాతి సంవత్సరం రూ. 40 వేలు, చివరి సంవత్సరం (2029-30)లో రూ. 30 వేల చొప్పున సబ్సిడీ లభిస్తుంది. ఎలక్ట్రిక్ గూడ్స్ వాహనాలకు ఇది మొదటి సంవత్సరం రూ. 1 లక్ష, ఆ తర్వాత రూ. 75 వేలు, చివరి ఏడాదిలో రూ. 50 వేల చొప్పున సబ్సిడీ లభిస్తుంది. 2030 సంవత్సరం తర్వాత నుంచి ఢిల్లీ రోడ్లపై పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే తిరిగేలా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని తీసుకొచ్చింది. కార్ల విషయంలో సైతం ఎక్స్-షోరూమ్ ధర రూ. 30 లక్షల లోపు ఉండే ఫోర్ వీలర్స్ కు రోడ్ టాక్స్, లైసెన్స్ ఫీజు 100% మాఫీ అవుతుందని పేర్కొన్నది.

