కలం, వెబ్‌డెస్క్: సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార కేసు (Unnao Case), బాధితురాలి తండ్రి కస్టోడియల్ మృతి కేసులో శిక్ష అనుభవిస్తున్న బీజేపీ బహిష్కృత నేత, మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ (Kuldeep Singh Sengar) కు దిల్లీ హైకోర్ట్ షాక్ ఇచ్చింది. పోలీస్ కస్టడీలో బాధితురాలి తండ్రి అనుమానాస్పద మృతి కేసులో సెంగార్‌కు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ మేరకు బెయిల్ కోరుతూ నిందితుడు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం సోమవారం కొట్టివేసింది.
సెంగార్‌కు బెయిల్ ఇచ్చేందుకు తగిన కారణాలు లేవని విచారణ సందర్భంగా జడ్జి రవీందర్ దొడేజా పేర్కొన్నారు. తదుపరి విచారణను వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేశారు. కాగా, గత నెలలో.. అత్యాచారం కేసులో (Unnao Case) నిందితునికి విధించిన శిక్షను రద్దు చేయడంతోపాటు, బెయిల్ ఇస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో సెంగార్ ప్రస్తుతం జైల్లోనే ఉన్నాడు.
కుల్దీప్.. ఉన్నావ్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 2017లో ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. దీనిపై కేసు నమోదు అయ్యింది. అయితే, బాధితురాలి తండ్రిని సైతం ఓ అక్రమ కేసులో జైలుకు పంపాడు. జైల్లో బాధితురాలి తండ్రి అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ఇందులో కుల్దీప్ ప్రమేయం ఉన్నట్లు తేలింది. మైనర్ బాలికపై రేప్, బాధితురాలి తండ్రి కస్టోడియల్ డెత్ రెండు కేసుల్లోనూ కుల్దీప్కు జైలు శిక్ష పడింది.
రేప్ కేసులో పడిన జీవిత ఖైదును నిరుడు డిసెంబర్లో ఢిల్లీ హైకోర్టు రద్దు చేయగా, ఆ తీర్పును సుప్రీం కొట్టివేసింది. ఇదే క్రమంలో ప్రస్తుతం బాధితురాలి తండ్రి కస్టోడియల్ డెత్ కేసులో పడిన పదేళ్ల శిక్షలో బెయిల్ కోరుతూ కుల్దీప్ చేసుకున్న పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు ప్రస్తుతం తిరస్కరించింది.
Read Also: అలర్ట్.. బ్యాంకులకు వరుసగా 4 రోజులు సెలవులు..!
Follow Us On: X(Twitter)


