కలం, వెబ్ డెస్క్ : బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్. ఈ జనవరి నెలలో బ్యాంకులకు వరుసగా నాలుగు రోజులు సెలవులు (Banks Closed) రాబోతున్నాయి. 5-డే వర్క్ వీక్ కావాలంటూ బ్యాంకు ఉద్యోగులు 27న సమ్మె చేయబోతున్నట్టు ప్రకటించాయి. జనవరి 24న నాలుగో శనివారం బ్యాంకులు పనిచేయవు (Banks Closed). 25న ఆదివారం, 26న రిపబ్లిక్ డే కూడా బ్యాంకులకు సెలవు. ఇప్పుడు 27న సమ్మె నిర్వహిస్తే ఆరోజు కూడా బ్యాంకులు తెరుచుకోవు. అంటే వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు పనిచేయవు. కాబట్టి బ్యాంకు లావాదేవీలతో పాటు ఇతర బ్యాంకు పనులను ఆ లోగా పూర్తి చేసుకుంటేనే బెటర్.
5-డే వర్క్ వీక్ అంటే.. వారంలో సోమవారం నుంచి శుక్రవారం దాకా ఐదురోజులే బ్యాంకులు పనిచేయాలన్నది బ్యాంకు ఎంప్లాయిస్ డిమాండ్. బ్యాంకింగ్ రంగంలో 5-డే వర్క్ వీక్ కావాలంటూ UFBU (యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్) ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. శనివారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసులు పనిచేయవని.. స్టాక్ మార్కెట్, మనీ మార్కెట్, స్టాక్ ఎక్స్ ఛేంజ్ లాంటి రంగాలు ఇప్పటికే 5-డే వర్క్ వీక్ ను అమలు చేస్తున్నాయని చెబుతోంది. కాబట్టి బ్యాంకింగ్ రంగంలోనూ అదే విధానం రావాలంటూ యూఎఫ్ బీయూ కోరుతోంది. దీని కోసం ఐదు రోజులు బ్యాంక్ ఉద్యోగులు 40 నిముషాలు ఎక్కువ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని.. దీని వల్ల మెరుగైన సేవలు అందడమే కాకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రావని చెబుతోంది యూఎఫ్ బీయూ. కాకపోతే ఇండియన్ బ్యాంకింగ్ రంగంలో దీన్ని అమలు చేయడం సాధ్యం కాదని ఆర్బీఐ ఇప్పటికే పలుమార్లు తెలిపింది. చిన్న, పెద్ద బ్యాంకులు, ప్రజల అవసరాలు, అనేక రంగాల లావాదేవీలను దృష్టిలో ఉంచుకుని దీన్ని అమలు చేయడానికి ఆర్బీఐ గతంలోనే అభ్యంతరం తెలిపింది. ఇప్పుడు బ్యాంకు ఉద్యోగుల ఒకరోజు సమ్మెతో ఆర్బీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి.


