కలం, వెబ్‌డెస్క్: ఢిల్లీ (Delhi)లో ఎండలు తీవ్ర స్థాయిలో మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలోని రద్దీ ప్రాంతాల్లో కూలింగ్ జోన్‌లు (Cooling Zones) ఏర్పాటు చేసింది. బస్టాండ్లు, మెట్రో స్టేషన్ల వద్ద టెంట్లు వేసి అక్కడ ప్రజలకు చల్లటి తాగు నీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేసింది. ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో సివిల్ డిఫెన్స్ వాలంటీర్లు ఈ కేంద్రాల వద్ద సేవలు అందిస్తున్నారు. ఎండలో ప్రయాణిస్తున్న వారు కొద్ది సేపు ఈ టెంట్ల కింద రెస్ట్ తీసుకొని తమ ప్రయాణాన్ని కొనసాగించవచ్చని అధికారులు సూచిస్తున్నారు.
అయితే ఈ కూలింగ్ జోన్లపై సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. కొందరు ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలను అభినందిస్తుండగా, మరికొందరు మాత్రం సెటైర్లు వేస్తున్నారు. నిజమైన కూలింగ్ జోన్లు అంటే శాశ్వత పరిష్కారమైన పచ్చదనాన్ని పెంచాలని, ప్రభుత్వం దాని పై దృష్టి పెట్టాలని నెటిజన్లు సూచిస్తున్నారు. ఏది ఏమైనా మండుటెండల్లో ప్రయాణిస్తున్న వారికి ఈ టెంట్లు మాత్రం కొంత మేర ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. ఇలాంటి చర్యలతో పాటు ప్రభుత్వం చెట్ల పెంపకంపై, కాలుష్య నివారణపై దృష్టి పెడితే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

