కలం, వెబ్ డెస్క్: డిగ్రీలో ప్రవేశాల కోసమని ఏటా నిర్వహించే దోస్త్ (DOST) కౌన్సెలింగులో పాల్గొనకుండా కొన్ని కాలేజీలు వ్యవహరిస్తున్న తీరు విస్మయం కలిగిస్తోంది. దోస్త్ నోటిఫికేషన్ ఈ నెల 15న విడుదల కాగా.. ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, హైదరాబాద్ చుట్టు పక్కల పేరున్న సుమారు 60 డిగ్రీ కాలేజీల పేర్లు మాత్రం దోస్త్ వెబ్ సైట్ లో కనిపించడం లేదు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆరా తీయగా.. ఉద్దేశపూర్వకంగా అవి వెబ్ సైట్ లోకి రావడం లేదని స్పష్టమవుతోంది. ఈ కాలేజీల పరిధిలో సుమారు 38 వేల సీట్లు ఉన్నట్లు సమాచారం.
ఉన్నత విద్యా మండలితో సంబంధం లేకుండానే..
ఇంటర్ లో వచ్చిన మార్కుల ఆధారంగా దోస్త్ (DOST) వెబ్ సైట్ ద్వారా విద్యార్థులకు కాలేజీలను కేటాయిస్తుంటారు. రాష్ట్రంలో 830 ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీలున్నాయి. వీటిలో 3.77 లక్షల సీట్లున్నాయి. సాధారణంగా అత్యధిక మార్కులు వచ్చినవారు.. మంచి కాలేజీల్లో చేరాలని ముందు నుంచే ప్రయత్నాలు చేస్తుంటారు. వాటి గురించి ముందే తెలుసుకుని.. కాలేజీ దోస్త్ కోడ్ కూడా కనుక్కుని సిద్ధంగా ఉంటారు. తీరా, వెబ్ సైట్ తెరిచాక.. అందులో అవి లేవని చూపిస్తుండటంతో నిరాశ చెందుతున్నారు. ఈ కాలేజీలు ఉన్నత విద్యా మండలితో సంబంధం లేకుండా సొంతంగా ప్రవేశాలు నిర్వహించుకుంటూ.. అందినకాడికి దోచుకుంటున్నాయనే విమర్శలు వస్తున్నాయి.
Read Also: అమ్రాబాద్ అడవుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
Follow Us On: X(Twitter)

