కలం కరీంనగర్ బ్యూరో: ప్రజల ప్రాణాలను కాపాడేందుకు, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కరీంనగర్ (Karimnagar) కమిషనరేట్ పరిధిలో కఠినంగా నిర్వహిస్తున్న డ్రంకెన్ డ్రైవ్ (Drunk – Drive Scam) తనిఖీలు కొంతమంది బాధ్యతారాహిత్య సిబ్బందికి కామధేనువుగా మారినట్లు తేలింది. పట్టుబడిన వాహనదారుల అమాయకత్వాన్ని, భయాన్ని ఆసరాగా చేసుకుని లక్షల్లో అక్రమ వసూళ్లకు పాల్పడిన దందా వెలుగులోకి రావడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.
డ్రంకెన్ డ్రైవ్ కేసుల పేరుతో కోట్ల రూపాయల అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వ్యవహారాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్ఎస్ఐ శ్రీకాంత్, కోర్టు డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ సాయి, ట్రాఫిక్ స్పెషల్ ఫైరింగ్ టీమ్ కు చెందిన ఇద్దరు పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
భారీ స్థాయిలో ‘డ్రంకెన్ డ్రైవ్’ వసూళ్లు
డ్రంకెన్ డ్రైవ్ నిబంధనల ప్రకారం.. మద్యం తాగి వాహనాలు నడిపితే బాధితులను కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుంది. అయితే కోర్టుకు వెళ్తే జైలు శిక్ష పడుతుందనే వాహనదారుల భయాన్ని ఆసరాగా చేసుకున్న ట్రాఫిక్ విభాగంలో పనిచేసే ఆర్ఎస్సై, స్టేషన్ రైటర్, కోర్టు కానిస్టేబుల్ ఈ వసూళ్లకు తెరలేపారు. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనదారుల వద్ద నుంచి రూ. 20 వేల నుండి రూ. 50 వేల వరకు, కొన్నిసార్లు రూ. లక్ష వరకు వసూలు చేసి, కేసే నమోదు చేయకుండా వదిలేశారని వెల్లడైంది.ఈ అక్రమ వసూళ్ల నెట్‌వర్క్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దృష్టి సారించి ప్రాథమికంగా దాదాపు 100 కేసుల్లో రూ. 30 లక్షలకు పైగా అక్రమంగా దండుకున్నట్లు గుర్తించారు. ప్రాథమిక విచారణ ప్రకారం ఈ ముఠా సుమారు 110 కేసుల్లో దాదాపు రూ. 30 లక్షలకు పైగా అక్రమంగా వసూలు చేసినట్లు గుర్తించారు.
టాస్క్‌ఫోర్స్ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు..
డ్రంకెన్ డ్రైవ్ కేటగిరీలో తీవ్రతను బట్టి జరిమానా, జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అయితే సస్పెండైన సదరు పోలీసు అధికారులు.. ‘డ్రంకెన్ డ్రైవ్’ తనిఖీల్లో వాహనదారులు పట్టుబడినప్పుడు బ్రీత్ అనలైజర్ రీడింగ్‌లో సవరణలు చేసి, తీవ్రమైన కేసులను సాధారణ కేసులుగా రికార్డు చేసినట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసుల తనిఖీల్లో వెల్లడైంది . జైలు శిక్ష పడకుండా తప్పిస్తామంటూ పట్టుబడిన వారి నుంచి రూ. 20,000 నుండి రూ. 50,000 వరకు, ఆపై రీడింగ్ తీవ్రతను బట్టి భారీగా తీసుకున్నట్లు తేలింది. అంతేకాదు చలానాలు చెల్లించకుండా మభ్య పెట్టారని.. కేసు రద్దు చేస్తామని డబ్బులు తీసుకుని, రికార్డుల్లో కేసు నమోదు కాకుండా మేనేజ్ చేసినట్లు వారిపై ఆరోపణలు ఉన్నాయి.
ఉన్నతాధికారుల సీరియస్ యాక్షన్
ఈ వ్యవహారం (Drunk – Drive Scam) పోలీస్ కమిషనర్ దృష్టికి రావడంతో ఆయన తక్షణమే స్పందించి విచారణకు ఆదేశించారు. విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో ఆర్ఎస్ఐ శ్రీకాంత్, కోర్టు కానిస్టేబుల్ సాయి, స్పెషల్ ఫైరింగ్ టీమ్‌కు చెందిన మరో ఇద్దరు పోలీసులపై సస్పెన్షన్ వేటు వేశారు. ప్రస్తుతం వీరిపై అదనపు విచారణ జరుపుతున్నారు. ప్రశాంత్ నగర్‌కు చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ దందా వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
గతంలో ఓ విభాగంలో పని చేసిన ఆర్ఎస్ఐ శ్రీకాంత్.. ఏసీబీ విభాగానికి బదిలీ అయినప్పటికీ ఆ ఉత్తర్వులు దాచిపెట్టి, ఇక్కడే తిష్ఠ వేసి ఈ మోసాలకు పాల్పడినట్లు సమాచారం అందుతోంది. వీరు ఇప్పటివరకు ఈ దందా ద్వారా రూ. 30 లక్షల వరకు అక్రమ వసూళ్లు జరిపినట్లు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే గతంలో నమోదైన ఇతర డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లోనూ ఇలాంటి అక్రమాలు జరిగాయా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు.
Read Also: కరీంనగర్‌ను ‘క్లీన్ అండ్ గ్రీన్ సిటీ’గా మారుస్తాం: మేయర్ శ్రీనివాస్
Follow Us On : WhatsApp

