రికవరీ ఏజెంట్ల వీరంగం: నడిరోడ్డులో వ్యక్తిపై దాడి!

కలం, వెబ్‌ డెస్క్ : పుణె (Pune) లోని హడప్సర్ ప్రాంతంలో దారుణ ఘటన వెలుగుచూసింది. క్రెడిట్ కార్డు బకాయిల వసూలు విషయంలో తలెత్తిన వివాదం చివరకు నడిరోడ్డుపై భౌతిక దాడికి దారితీసింది. 15 నంబర్ చౌక్ సమీపంలోని హడప్సర్ రోడ్డుపై పట్టపగలే రికవరీ ఏజెంట్లు (Recovery Agents) ఒక వ్యక్తిని చుట్టుముట్టి విచక్షణారహితంగా కొట్టారు. బాధితుడు కిందపడిపోయినా ఏజెంట్లు కనికరం లేకుండా పిడిగుద్దులు కురిపిస్తూ తన్నుతుండటం అక్కడి ప్రయాణికులను దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర కలకలం రేగింది. బాధితుడితో ఉన్న ఒక మహిళ దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ ఏజెంట్లను బతిమాలడం వీడియోలో కనిపిస్తోంది. బకాయిల వసూలు కోసం థర్డ్ పార్టీ ఏజెంట్లు ఈ స్థాయిలో హింసకు పాల్పడటంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే పోలీసులు జోక్యం చేసుకుని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం బకాయిల వసూలు సమయంలో కస్టమర్లను వేధించడం లేదా భౌతిక దాడులకు పాల్పడటం చట్టరీత్యా నేరం. బ్యాంకులు తమ రికవరీ ఏజెంట్లు నిబంధనలు పాటించేలా చూడాలని మార్గదర్శకాలు ఉన్నప్పటికీ ఇలాంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బాధితుడితో పాటు రికవరీ ఏజెంట్లను విచారణ నిమిత్తం స్టేషన్‌కు తరలించారు.

Read Also: అమ్రాబాద్ అడవుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>