సంపత్ సంచలనం.. కేటీఆర్, హరీశ్ రావులపై పరువు నష్టం దావా!

కలం, వెబ్ డెస్క్: తనపై, కాంగ్రెస్ పార్టీపై అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారంటూ ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ (Sampath Kumar) ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఆయన బీఆర్ఎస్ అగ్రనేతలు హరీశ్ రావు, కేటీఆర్ (KTR), క్రిశాంక్‌తో పాటు నమస్తే తెలంగాణ పత్రిక, తెలుగు స్క్రైబ్ సోషల్ మీడియా సంస్థలపై ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో పరువు నష్టం దావా వేశారు. జన్వాడ ఫామ్ హౌస్ వేదికగా కుట్రలు పన్నుతూ, కాంట్రాక్టర్ వద్ద తాను 8 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు కట్టుకథలు అల్లి ప్రచారం చేశారని మండిపడ్డారు. రాజకీయాలు చేతకాకపోతే ఫామ్ హౌస్‌కే పరిమితం కావాలని, అడ్డగోలు రాతలు రాస్తే సహించేది లేదని హెచ్చరించారు. తనపై విషం చిమ్మిన వారికి కచ్చితంగా శిక్ష పడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ నాయకులు నపుంసక రాజకీయాలు మానుకోవాలని, గతంలో హరీశ్ రావు తనకు 30 కోట్లు ఇస్తాం పార్టీ మారమని ఆశ చూపినా లొంగలేదని సంపత్ కుమార్ గుర్తుచేశారు. తన నరనరాల్లో కాంగ్రెస్ (Congress) భావజాలం ఉందని, ఇలాంటి చిల్లర ప్రచారాలకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ పార్టీ పైన కల్పిత వార్తలను ప్రచారం చేస్తున్న వారిపై తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమని, కానీ వ్యక్తిత్వ హననానికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>