కలం, కరీంనగర్: అంత్యోదయ స్ఫూర్తి ప్రదాత, దేశభక్తికి నిలువెత్తు రూపం పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ (Deendayal Upadhyaya) అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం కొనియాడారు. బీజేపీ కరీంనగర్ (Karimnagar) జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం పార్లమెంట్ కార్యాలయంలో దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సాయిని మల్లేశం మాట్లాడుతూ.. సమాజాభివృద్ధే ధ్యేయంగా దీన్ దయాల్ ఉపాధ్యాయ తన జీవితాన్ని కొనసాగించారని అన్నారు. దేశానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ప్రతిపాదించిన ‘ఏకాత్మ మానవతావాదం’ భావజాలం దేశ రాజకీయాలకు, సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తుందని తెలిపారు.
సమాజంలో అట్టడుగున ఉన్న చివరి వ్యక్తికి కూడా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలనే లక్ష్యంతో ‘అంత్యోదయ’ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లారని చెప్పారు. నిస్వార్థ రాజకీయాలు, అంకితభావం, దేశభక్తి నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. బీజేపీ కార్యకర్తలు దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాదగిరి సునీల్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శులు మాడ వెంకట్ రెడ్డి, గుజ్జ శ్రీనివాస్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఆడిచెర్ల రాజు, పార్టీ నాయకులు, మండల అధ్యక్షులు, కార్పొరేటర్లు, బీజేవైఎం నాయకులు తదితరులు పాల్గొని దీన్ దయాల్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

